రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం

31 Dec, 2019 04:37 IST|Sakshi

ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే పిల్‌ వేయడం అపరిపక్వమన్న హైకోర్టు

ప్రభుత్వ కౌంటర్‌ తర్వాతే స్పందిస్తామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో.. ఇప్పటికప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే.. రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే తగిన విధంగా స్పందిస్తామని, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఎన్‌ రావు కమిటీ, బోస్టస్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 585ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికను అమలు చేయకుండా చూడాలని.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటివన్నీ అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు అనుబంధ వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 

భూముల అభివృద్ధి, రాజధానిపై నిర్ణయం వేర్వేరు అంశాలు: హైకోర్టు 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, జీఎన్‌ రావు కమిటీ ఏర్పాటు జీవో, తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ జీవోలో ఎక్కడా సీఆర్‌డీఏ చట్టం ప్రస్తావన లేదన్నారు. దాని ప్రస్తావన లేకుండా రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ చట్టంలో ఎక్కడా నిర్ణీత కాల వ్యవధిలోగా భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని లేదని.. రైతుల భూముల్ని అభివృద్ధి చేయడం గురించి మాత్రమే ఉందని పేర్కొంది.

రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం, రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించింది. భూములిచ్చిన రైతులకు వారి భూములను అభివృద్ధి చేసి ఇవ్వడమే ముఖ్యమని, మిగిలిన భూమి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను మీరెలా తప్పు పట్టగలరని ప్రశ్నించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా.. తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఇంకా బీసీజీ నివేదిక రావాల్సి ఉందని.. ఈ దశలో ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. 

మా వాదనలూ వినండి 
ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న జీఎన్‌ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది.  

మరిన్ని వార్తలు