ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

16 Nov, 2023 17:19 IST|Sakshi

సాక్షి, గుంటూరు: స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో.. ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు.. 
ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ కండిషన్స్‌ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. స్కిల్‌ స్కామ్‌ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారు. బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్‌, కన్వేల్కర్‌ మెస్సేజ్‌ల ఆధారంగా డబ్బు హైదరాబాద్‌కు చేరినట్లు తెలిసింది.

స్స్కిల్‌ స్కామ్‌లో మెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారు.

చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు

లూథ్రా వాదనలు
ఎన్నికల ముందు కావాలనే అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పిటిషన్‌పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్‌ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్‌ ఎథిక్స్‌కు విరుద్ధం. పోలీస్‌ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. 

పొన్నవోలు, లూథ్రా తమ తమ వాదనలు ముగించడంతో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది ఏపీ హైకోర్టు.

మరిన్ని వార్తలు