గాడిలోకి పాలన..!

23 Jun, 2019 07:58 IST|Sakshi
కె.శ్రీనివాసులు, సాయికాంత్‌ వర్మ

జాయింట్‌ కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు

ఐటీడీఏ పీవోగా సాయికాంత్‌ వర్మ

ఏపీ ట్రాన్స్‌కోకి చక్రధరబాబు బదిలీ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్త ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని గాడినపెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా పోలీసు బాస్‌ను మార్పు చేయడంతో తొలి అడుగు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఏఎస్‌ అధికారులనూ బదిలీ చేసింది. శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కేవీఎన్‌ చక్రధరబాబును బదిలీచేస్తూ ఏపీ ట్రాన్స్‌కోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.శ్రీనివాసులుకు పోస్టింగ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పథక సంచాలకుడిగా పనిచేస్తున్నారు. అలాగే సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి లోతేటి శివశంకర్‌ విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సీఎం సాయికాంత్‌ వర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్‌ సబ్‌కలెక్టర్‌గా వర్మ పనిచేస్తున్నారు.

తొలి నుంచీ వివాదాలే..
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ 2016 నవంబరు 16వ తేదీన కేవీఎన్‌ చక్రధరబాబు జాయింట్‌ కలెక్టరుగా బదిలీపై వచ్చారు. 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా జిల్లా పరిపాలన వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తారని ప్రజలు ఆశించినప్పటికీ ఆ స్థాయిలో సేవలు అందించలేకపోయారు. తొలిరోజుల్లోనే రెవెన్యూ విభాగంలో ఉద్యోగులతో ముఖ్యంగా తహసిల్దార్లతో వివాదాలు తెచ్చుకున్నారు. ఉద్యోగులు ఒకరోజు విధులను సైతం బహిష్కరించి జిల్లా కలెక్టరేట్‌కు సమీపంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద నిరసన తెలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహం ఈ వివాదం సద్దుమణిగేలా చేశారు. వంశధార, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులతోపాటు కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం నిర్వాసితులకు పరిహారం ప్యాకేజీల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలను చక్రధరబాబు నిలువరించలేకపోయారు.

ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండతో చెలరేగిపోయిన అవినీతిపరులకు ఆయన అండగా ఉన్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. తిత్లీ తుఫానుతో జిల్లాలో ఉద్దానం ప్రాంతమంతా దెబ్బతిన్నప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునే విషయంలో సరైనరీతిలో స్పందించలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించారని జిల్లా రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడ్డారు. ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం ఆయన్ను అంతగా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఐటీడీఏలో తనదైన ముద్ర...
సీతంపేట ఐటీడీఏ పీవో పోస్టులో ఐఏఎస్‌ అధికారిని నియమించడం లోతేటి శివశంకర్‌తోనే మొదలైంది. 2016 నవంబరు 16న పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పోస్టులో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారిగా గుర్తింపుపొందారు. జిల్లా పర్యాటక రంగంలో సీతంపేటకు స్థానం కల్పించడంలో తనదైన పాత్ర పోషించారు. అడ్వంచర్‌ పార్కు, మెట్టుగూడ జలపాతం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించారు. హెచ్‌ఎన్‌టీసీ నర్సరీలో మన్యం ఎకో పార్కును తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టారు. పీఎంఆర్‌సీలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కృషి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ‘నెలనెలా వెన్నెల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆయనపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యాటక రంగం అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తావిచ్చారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ మంత్రులు, నాయకులకు కొమ్ముకాశారని గిరిజన సంఘాలు నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. 

జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు...
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్‌ కె.శ్రీనివాసులు వెటర్నరీ సైన్స్‌ (పశువైద్యం)లో పట్టభద్రుడు. 2007 సంవత్సరంలో గ్రూప్‌–1కు ఎంపికయ్యారు. డిప్యూటీ కలెక్టరుగా నరసారావుపేట, రాజంపేట, జంగారెడ్డిగూడెంలో పనిచేశారు. డీఆర్‌డీఏ, డ్వామా పీడీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. పులిచింతల ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారు. ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్నారు. బదిలీపై శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టరుగా వస్తున్నారు. రెండ్రోజుల్లో విధుల్లో చేరతానని ‘సాక్షి’కి చెప్పారు.

ఐటీఏడీ పీవో సీఎం సాయికాంత్‌ వర్మ...
కర్నూలు జిల్లాకు చెందిన సాయికాంత్‌ వర్మ మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదివారు. 2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. అదీ తొలి ప్రయత్నంలోనే పొందడం విశేషం. తొలి పోస్టింగ్‌లో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరుగా నియమితులయ్యారు. 2017 అక్టోబరు 4వ తేదీ నుంచి ఈ పోస్టులో 20 నెలల పాటు పనిచేశారు. అక్కడి నుంచి సీతంపేట ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు.

మరిన్ని వార్తలు