‘ఉల్లి ధర ఎంతైనా రూ 25కే’

8 Dec, 2019 19:01 IST|Sakshi

సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 కే సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కిలో ఉల్లికి రూ. 90 నుంచి 100 వరకూ సబ్సిడీ భారాన్ని భరిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ధర బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 150 నుంచి రూ. 200 పలుకుతోందని, పొరుగు రాష్ట్రం తెలంగాణలో రైతు బజార్లలోనే అక్కడి ప్రభుత్వం ఉల్లి  కిలో రూ. 45కు అమ్ముతోందని చెప్పారు.

మిగతా రాష్ట్రాల్లో బహిరంగ మార్కెట్లలో అయితే రూ. 150 నుంచి 200 వరకూ అమ్ముతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం రూ. 25కే సబ్సిడీపై ప్రజలకు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలను ప్రజలకు అందుబాటులో ఉంచామని..వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ , మార్కెటింగ్‌శాఖ , రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులతో నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలుతో పాటు గత రెండు మూడురోజులుగా తాడేపల్లి గూడెం నుంచి కూడా ఉల్లిని కొనుగోలు చేసి.. సబ్సిడీపై ప్రజలకు అందిస్తోందని చెప్పారు.

ఇప్పటివరకు ఉల్లిని ప్రజలకు అందుబాటు ధరకు కిలో రూ. 25కే ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 25 కోట్లు ఖర్చు  చేసి దాదాపు 35 వేల క్వింటాళ్ళను కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసిందని తెలిపారు. ఎన్నికల వాగ్దానం మేరకు.. ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు