వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం

10 Feb, 2020 03:48 IST|Sakshi
సంఘీభావం ప్రకటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి వ్యవస్థాపకుడు రాజారెడ్డి, ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఆచార్య లజపతిరాయ్‌ తదితరులు

మేధావుల సదస్సులో వక్తల అభిప్రాయం

24న తిరుపతిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఐక్య సదస్సు  

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం సాకారమవుతుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం సమావేశ మందిరంలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి’ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి మేధావుల సదస్సును నిర్వహించింది. సమితి వ్యవస్థాపకుడు ఎన్‌.రాజారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ఏక కేంద్రంగా పరిపాలన, అభివృద్ధి జరుగుతోందని, ఇది రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు. రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన వెయ్యి పడకల క్యాన్సర్‌ ఆస్పత్రిని అమరావతికి తరలించడం శోచనీయమన్నారు. ఏపీ ఎన్‌జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడ్డాయని కేంద్రం గుర్తించిందని, వీటికి ఊతం ఇచ్చేలా మూడు రాజధానుల నిర్ణయం నిలుస్తుందని తెలిపారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం అంతంత మాత్రంగానే నిధులు ఇస్తోందని, ఇలాంటి సమయంలో విశాఖను పాలనా రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమన్నారు. పాలన వికేంద్రీకరణ జరగకపోతే చరిత్ర పునరావృతమై రాష్ట్ర విభజన దిశగా అడుగులు పడతాయని అంబేడ్కర్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్‌ అభిప్రాయపడ్డారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పేరుతో అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిందని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వద్ద 7 వేల ఎకరాల భూములు ఉండటం వెనుక ఆంతర్యమేమిటో తెలియాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఓఆర్‌ రెడ్డి, ఆచార్య టి.తిమ్మారెడ్డి, ఆచార్య నిమ్మ వెంకటరావు, ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య కె.చంద్రమౌళి, తిరుపతి నుంచి కుసుమకుమారి, కర్నూలు నుంచి లక్ష్మీ నారాయణ, కడప నుంచి మునిరాజు, అనంతపురం నుంచి అవుల మనోహర్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ నెల 24న తిరుపతి వేదికగా ఉత్తరాంధ్ర, రాయలసీమ మేధావుల ఐక్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

విశాఖ నుంచే ఎన్జీవోల కార్యకలాపాలు 
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఉద్యోగులు స్వాగతిస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం విశాఖ ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే విశాఖలో రాష్ట్ర ఎన్జీవో కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని, ఇక్కడ నుంచే కార్యకలాపాలు జరుగుతాయని వివరించారు. 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు