ప్రే‘ముంచినందుకు’..యావజ్జీవం..

1 Oct, 2014 02:50 IST|Sakshi
ప్రే‘ముంచినందుకు’..యావజ్జీవం..

 విజయనగరం లీగల్/శృంగవరపు కోట రూరల్:  నిన్నే ప్రేమించానన్నాడు. పెళ్లాడతానని ప్రమాణం చేశాడు. కొన్నాళ్లు వివాహేతర సంబంధం నడిపాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి తనకు ముందే పెళ్లయిందని నంగనాచి కబుర్లు చెప్పాడు. ప్రేమించి ముంచినందుకు చివరకు  కటకటాల పాలయ్యాడు. దళిత  యువతిని ప్రేమ పేరుతో  నమ్మించి  వంచించాడన్న కేసు  రుజువు కావడంతో  ఎస్‌కోట మండల కేంద్రం పెద్ద వీధికి చెందిన పొట్నూరు అప్పలనాయుడుకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె.వి.రమణాజీరావు మంగళవారం తీర్పు చెప్పారు.
 
 పాసిక్యూషన్ కథనం ప్రకారం  వివరాలు ఇలా ఉన్నాయి.  నిందితుడు అప్పలనాయుడు ఎస్‌కోట హౌసింగ్ డిపార్టుమెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు ఎల్‌కోట కంప్యూటర్ ప్రెజెంటేషన్ రిసోర్స్ కేంద్రంలో పనిచేస్తోంది. 2006నుంచి అప్పలనాయుడు ఉద్యోగ రీత్యా ఎల్‌కోటకు వస్తుండేవాడు.అదే సమయంలో  ఆమెతో పరిచయం  ఏర్పడింది. అది కాస్తా  ప్రేమగా  మారింది. దీంతో ఆమెను పెళ్లి పేరుతో  లొంగదీసుకుని  వివాహేతర సంబంధం కొనసాగించాడు. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు.  సుమారు అయిదేళ్ల పాటు వారి సంబంధం, ప్రేమ కొనసాగింది. 2011 సెప్టెంబరులో అప్పలనాయుడును పెళ్లి విషయమై బాధితురాలు నిలదీసింది. దీంతో అప్పలనాయుడు తనకు ఇది వరకే వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారంటూ అసలు విషయం చెప్పాడు.  
 
 ఈ విషయంపై ఇరువర్గాల పెద్దల మధ్య చర్చలు కూడా జరిగాయి. రెండో  భార్యగా ఆమెను స్వీకరిస్తానని అప్పలనాయుడు చెప్పడంతో బాధితురాలు ఇష్టం లేకపోయినా సరేనంది. నెలలు గడుస్తున్నా  అప్పలనాయుడు మౌనంగా ఉండడంతో కుటుం బ సభ్యులతో పాటు వెళ్లి అప్పలనాయుడును నిల దీసింది. తమ కుటుంబ సభ్యులు    భార్యగా స్వీకరించడానికి  ససేమిరా అంటున్నారంటూ డబ్బులిచ్చి  ఆమెను వదిలించుకోవాలని చూశాడు.  అప్పటికే  రెండుసార్లు మోసపోయానని గ్రహించిన ఆమె 2012 అక్టోబరు 25న పోలీసుకలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు  అప్పలనాయుడుపై అత్యాచారం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టంకింద ఎస్‌కోట పోలీసులు  కేసులు నమోదు చేశా రు.  ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలతో  కేసు రుజువు చేయడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున నాగమల్లేశ్వరరావు వాదించారు.
 

మరిన్ని వార్తలు