జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు 

20 Jul, 2019 05:07 IST|Sakshi

ముందు కటాఫ్‌ మార్కుల నిర్ణయం 

అనంతరం 1:12, లేదా 1:15 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపిక 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఏపీపీఎస్సీ చైర్మన్‌ భేటీ 

1:50పై కొత్తగా జీవో ఇస్తే.. వచ్చే నోటిఫికేషన్లలో అమలు చేస్తామన్న ఉదయభాస్కర్‌  

నిరుద్యోగ అభ్యర్థుల్లో నైరాశ్యం  

సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను జీవో 5 ప్రకారమే చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. దీని ప్రకారం ఆయా పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్ష నుంచి మెయిన్స్‌కు ముందుగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి.. అనంతరం 1:12, లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లలో జీవో 5ను ప్రస్తావిస్తూ.. దాని ప్రకారమే ఎంపికలుంటాయని పొందుపరిచినందున ఆ దిశగానే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. తాజాగా కమిషన్‌ తీసుకుంటున్న ఈ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేస్తోంది.  

సీఎస్‌తో ఏపీపీఎస్సీ చైర్మన్‌ భేటీ 
ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 (అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున) నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కొంతకాలంగా నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి కూడా పలుమార్లు వినతిపత్రాలిచ్చారు. ఏపీపీఎస్సీ ఈ అంశంపై ఏమీ తేల్చకపోవడంతో గ్రూప్‌–3, గ్రూప్‌–2, గ్రూప్‌–1 పోస్టులకు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. మెయిన్స్‌కు 1:12, లేదా 1:15 ప్రకారం కాకుండా.. 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేస్తారన్న ఆశతో నిరుద్యోగులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని కొత్తగా జీవో ఇస్తే ఆ ప్రకారమే చేస్తామని ఏపీపీఎస్సీ కొంతకాలంగా చెబుతుండటంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి ఇదివరకే దీనిపై మొరపెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎంపికల తీరుపై ప్రభుత్వం ఏపీపీఎస్సీని వివరాలడగడంతో.. ఏపీపీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గ్రూప్‌ పరీక్షల ఫలితాల వెల్లడిలో ఏర్పడిన ప్రతిష్టంభనపై ప్రభుత్వానికి వివరించారు. 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికచేయడం వల్ల అభ్యర్థుల సంఖ్య వేలాదిగా పెరిగి ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. ఆ తర్వాత పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ విధానాన్ని అనుసరించి 1:12, లేదా 1:15 నిష్పత్తిని పాటిస్తామని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. దాని ఆధారంగా ప్రభుత్వం జీవో 5 ద్వారా ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏపీపీఎస్సీకి ఇచ్చినట్టు చెప్పారు.

ఈ జీవో ద్వారా గ్రూప్‌ నోటిఫికేషన్లలో ఎంపికలుంటాయని పేర్కొన్నామని, దీన్ని మార్పు చేస్తే న్యాయపరంగా ఇబ్బందులొచ్చే ప్రమాదముందని చెప్పినట్టు తెలిసింది. నోటిఫికేషన్లలో జీవోను ప్రస్తావించినందున ఆ ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొనడంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అందుకు సమ్మతించినట్లు కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్‌–3, గ్రూప్‌–2, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ముందుగా కటాఫ్‌ నిర్ణయించాక నిర్ణీత నిష్పత్తిలో ఆయా కేటగిరీలవారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని భేటీ అనంతరం ప్రొఫెసర్‌ పి.ఉదయభాస్కర్‌ ‘సాక్షి’కి వివరించారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని గుర్తుచేయగా.. అందుకు అవకాశం లేదన్నారు. జీవో 5ను రద్దుచేసి 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం కొత్తగా జీవో ఇస్తే.. రానున్న నోటిఫికేషన్లలో అమలు చేస్తామని వివరించారు. 

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై తేలితే మరో 9 నోటిఫికేషన్లు 
ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీకి పదిశాతం కోటా అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్ట ఉత్తర్వులొస్తే.. పెండింగ్‌లో ఉన్న 9 నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చైర్మన్‌ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ అంశాన్ని ప్రస్తావించామని, త్వరలోనే ఉత్తర్వులిస్తామన్నారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హారిజాంటల్‌ (సమాంతరం)గా అమలు చేయడంపై కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. కమిషన్‌లో భర్తీచేయాల్సిన పోస్టులపై కూడా ప్రధాన కార్యదర్శికి వివరించినట్టు చెప్పారు. దాదాపు 200 మంది సిబ్బంది ఉండేలా కమిషన్‌లో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని.. ముఖ్యంగా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 57కుగాను ఇద్దరే ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీపీఎస్సీ బడ్జెట్‌ను రూ.90 కోట్లు చేయాలని కోరినట్టు ఉదయభాస్కర్‌ వివరించారు.   

మరిన్ని వార్తలు