ఆర్టీసీకి పోలవరం భారం

24 Feb, 2019 15:50 IST|Sakshi

పోలవరం యాత్ర పేరిట ఉచిత సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ

ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ. 35కోట్ల బకాయిలపై సర్కారు నిర్లక్ష్యం

సాక్షి, అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ఏపీఎస్‌ఆర్టీసీ) పోలవరం ప్రాజెక్టు యాత్రలు పెనుభారంగా మారాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం యాత్రకు ఉచిత సర్వీసులను నడిపిస్తుండడంతో నష్టాలు రెట్టింపువుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతిరోజూ పోలవరానికి వందకు పైగా సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. ఇందుకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదు. బకాయిలు చెల్లిస్తే తప్ప పోలవరం యాత్రకు బస్సులు నడిపించలేమని యాజమాన్యం తేల్చి చెబుతోంది. జలవవనరుల శాఖ నుంచి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అది అతీగతీ లేకుండా పోయిందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేసి మరీ పోలవరం యాత్రకు బస్సులు నడిపిన ఆర్టీసీ ఇటీవలి కాలంలో ప్రజా రవాణాలో తన వాటా కొంత కోల్పోయినట్లు సమాచారం. 

గతంలో ప్రజా రవాణాలో ఆర్టీసీకి 38 శాతం వాటా ఉండేది. ఇప్పుడది 35 శాతానికి పరిమితమైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోలవరం యాత్రలను సైతం లెక్కల్లో చూపించి ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు నమ్మబలుకుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం విధిస్తున్న మోటార్‌ వాహన పన్ను, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్‌ వంటివి ఆర్టీసీకి పెను శాపంగా మారాయి. ఆర్టీసీలో ప్రతి టిక్కెట్‌ ఆదాయంపై 7 శాతం పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. గుజరాత్‌ మాదిరిగా దీన్ని 1 శాతానికి తగ్గించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. డీజిల్‌పై 17 శాతం‘వ్యాట్‌’ను వసూలు చేస్తోంది. పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా రాయితీ ఇవ్వడం లేదని ఆర్టీసి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

రు.1000 కోట్లకు పైగా చేరిన నష్టాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ నష్టాలు రూ.1000 కోట్లు దాటాయి. అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీని పోలవరం యాత్రలు మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.35 కోట్ల బకాయిలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో పోలవరం యాత్రలకు బ్రేకులు వేయాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు