మెడ్‌టెక్‌ జోన్‌లో మెగా ఎక్స్‌పో సిటీ

11 Nov, 2023 06:26 IST|Sakshi
విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో నిర్మించిన ఇండియా ఎక్స్‌పో సిటీ 

లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం... 150 రోజుల్లో నిర్మాణం

ప్రారంభమైన తొలి రోజే అంతర్జాతీయ సదస్సు 

14 నుంచి డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ ఫోరం సమావేశం

హాజరుకానున్న 80దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ సమయంలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్‌ సెంటర్‌... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్‌ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్‌పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్‌పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్‌ క్లినికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ ప్రారంభం కావడం విశేషం. 

ఇవీ ప్రత్యేకతలు... 

  • మెడ్‌టెక్‌ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్‌పో సిటీ నిర్మాణ పనులు జూన్‌ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.     మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. 
  • ఈ ఎక్స్‌పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ వినియోగించారు.
  •  రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్‌పో సిటీని నిర్మించారు. 
  • లోపల భాగంలో ఒక్క కోలమ్‌ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి  చేయడం విశేషం. 
  • ఎక్స్‌పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్‌ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 
  •  16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్‌ప్లే షాప్స్‌ ఏర్పాటుచేసుకోవచ్చు. 

తొలి రోజే అంతర్జాతీయ సదస్సు 
ఇండియా ఎక్స్‌పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌(ఏఏఎంఐ), గ్లోబల్‌ క్లినికల్‌ ఇంజినీరింగ్‌ అలయెన్స్‌(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్‌ క్లినికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో  కోవిడ్‌–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై చర్చిస్తారు.

అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్‌ జోన్‌లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాబర్ట్‌ బరోస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు