కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ

7 Oct, 2018 09:27 IST|Sakshi

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి  రెండో రోజు 3,800  మంది హాజరు  

కష్టాలను అధిగమించి ర్యాలీలో పాల్గొన్న యువత 

నేడు కర్నూలు జిల్లా అభ్యర్థులకు పోటీలు 

కర్నూలు: ఉద్యోగ లక్ష్య సాధనలో నిరుద్యోగులు అర్ధాకలితో రోడ్లపైనే పడిగాపులు కాస్తూ అల్లాడుతున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి కాళ్లనొప్పులు భరించలేక తల్లడిల్లుతున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లారే దాకా ఆర్మీ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంతో చేసేదేమీ లేక దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువకులు రోడ్లపైనే తిష్ట వేసి అధికారుల పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ రెండో రోజు శనివారం కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరైన నిరుద్యోగ యువకులు క్యూలైన్ల వద్దనే కునుకు తీస్తూ సేద తీరుతున్నారు.

 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంపిక పోటీలు ప్రారంభమై శనివారం ఉదయం 10 గంటలకు ముగిసింది. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన సుమారు 3,800 మంది అభ్యర్థులు పోటీల్లో పాల్గొని తమ అదృ ష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ బింద్రా పర్యవేక్షణలో ఈనెల 15 వరకు ఆర్మీ ఎంపిక పోటీలు కొనసాగనున్నాయి. ఏడు జిల్లాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు కర్నూలుకు తరలివస్తున్నారు. మూడవ రోజు కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఆహ్వానించడంతో శనివారం రాత్రే పెద్ద ఎత్తున కర్నూలుకు చేరుకున్నారు.  

ఫలితాల ప్రకటనపై అధికారుల ఆంక్షలు 
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఏయే రోజు ఏ జిల్లా నుంచి హాజరవుతున్నారు, రాత పరీక్షకు ఎంతమంది ఎంపికయ్యారనే వివరాల వెల్లడిపై నిర్వాహకులు గోప్యత పాటిస్తున్నారు. కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారులు కొంతమంది కుమ్మౖMð్క విషయాలు బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పోటీలో పాల్గొన్నప్పటికీ వారు రాత పరీక్షకు ఎంపికయ్యారా లేదా అనే విషయంపై ఆంక్షలు విధిస్తుండటంతో కొంతమంది అనుమానంతో అధికారులతో వాదనకు దిగుతున్నారు.      

మరిన్ని వార్తలు