పంట పాడుచేసిన హెలికాప్టర్‌

12 Dec, 2017 09:16 IST|Sakshi
పడిపోయిన అరటిచెట్లు

సీఎం ఇంటికి స్వామీజీ రవిశంకర్‌ రాక

గాలి వేగానికి నేలవాలిన అరటితోట

ఉండవల్లి రైతుకు రూ.25వేల ఆర్థిక నష్టం

తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): ఉండవల్లిలోని అమరావతి కరకట్ట వెంట నివసించే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సోమవారం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ స్వామీజీ రవిశంకర్‌ విచ్చేశారు. ఆయన హెలికాప్టర్‌ దెబ్బకు పక్క పొలంలో అరటితోట నేలకూలింది. సదరు రైతుకు రూ.25 వేలు ఆస్తి నష్టం సంభవించింది. బాధితుడైన రైతు దంటు రఘు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం సీఎం నివాసానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ స్వామీజీ విచ్చేశారు. ఆయన వచ్చిన హెలికాప్టర్‌ రఘు పొలానికి అతి సమీపం నుంచి ప్రయాణించడంతో తోటలో ఉన్న అరటిచెట్లన్నీ నేల ఒరిగాయి. మొత్తం 80 చెట్ల వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గెల రూ.210లకు పంట పొలంలోనే అమ్ముతున్నామని, దాదాపు రూ.25 వేల నష్టం సంభవించిందని రైతు వాపోయాడు.

హెలికాప్టర్‌ వచ్చిన సమయంలో పొలంలో పనిచేస్తున్నామని, కళ్ల ముందే చెట్లన్నీ నేలకొరుగుతున్నాయని, వెంటనే తోటలో ఉన్న ముగ్గురు కూలీలతో కలిసి నాలుగు చెట్లు పట్టుకోగా అవి మాత్రమే ఆగాయని తెలిపారు. మిగతావన్నీ కూలిపోయాయని ఆవేదనతో చెప్పారు. గడబొంగులు సైతం విరిగాయన్నారు. సీఎం భేటీ అనంతరం స్వామీజీ విజయవాడ వెళ్తుండగా, వారి బృందానికి జరిగిన విషయం చెప్పానని, అయితే విజయవాడ వెళ్లి వచ్చిన తర్వాత నష్టపరిహారం గురించి మాట్లాడతామని చెప్పారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చేలోనే కూర్చుని తిరిగి మళ్లీ కలిశానని, అయితే సీఎం సెక్యూరిటీ నష్టపరిహారం అందజేస్తారని సదరు స్వామీజీ భక్తులు తెలియజేశారని రఘు చెప్పారు.

మరిన్ని వార్తలు