ప్రజలను నిర్వాసితులను చేస్తే సహించం

10 Jul, 2016 21:26 IST|Sakshi
- రైతులు, ప్రజల పొట్టగొట్టే ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం
- బందరులో జరిగే ఉద్యమాలకు అండగా ఉంటాం
- పది వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం
సాక్షి, విజయవాడ: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమి సమీకరించేలా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు జరిపే ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించారు.


విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు గుర్ర విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశ నిర్ణయాలను పది వామపక్షపార్టీల నేతలు పత్రికలకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17న విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

విశాఖలో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్శింగరావు, నగర కార్యదర్శి బి.గంగారావులతో పాటు 26మంది నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. సమావేశంలోపి.మధు, వై.వెంకటేశ్వర్లు(సీపీఎం), కె.రామకృష్ణ, ముప్పాళ్లనాగేశ్వరరావు, జెల్లివిల్సన్(సీపీఐ), పి.ప్రసాద్, యు.వెంకటేశ్వర్లు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), హరినాథ్, సత్యనారాయణ(సీపీఐఎంఎల్-లిబరేషన్), పి.రామారావు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), పి.సుందరామరాజు, అజీం పాషా, సుభాష్ చంద్రారెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), కిషోర్(సీపీఐఎంఎల్) హాజరయ్యారు.
మరిన్ని వార్తలు