Afghan Embassy Closed: భారత్‌లో ఆఫ్ఘన్‌ ఎంబసీ మూసివేత!

1 Oct, 2023 08:59 IST|Sakshi

ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 1) నుండి భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఎంబసీ ఆదివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

ఈ నిర్ణయం గురించి ఆఫ్ఘన్ అధికారులు మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం  కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి.  ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. 

ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్‌కు వెళ్లి, యూఎస్‌ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు.
 
న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ!
 

మరిన్ని వార్తలు