హృదయాలను హత్తుకున్న బీసీ డిక్లరేషన్‌

18 Feb, 2019 03:12 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి జేజేలు పలుకుతున్న బీసీలు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటనతో వెల్లువెత్తిన ఆనందం

ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌సీపీ బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ బీసీల హృదయాలను హత్తుకుంది. ప్రతి బీసీ కుటుంబం రాజకీయంగా ఎదగడమే కాకుండా, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీతో సభ చప్పట్లతో మారుమోగింది. 139 కార్పొరేషన్‌లు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామని, ప్రతి కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతి హామీకి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంటుందని స్పష్టంగా చెప్పడంతో సభ కరతాళధ్వనులతో మారుమోగింది. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు ఎలా మోసం చేశారో జగన్‌ వివరించారు. అటువంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రజలను అడగ్గా వద్దూ.. వద్దూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. సభలో జగన్‌ ఇచ్చిన హామీలు అందరి మనస్సులను తాకాయి. ఐదేళ్లలో బీసీల కోసం రూ.75 వేల కోట్లు ఖర్చుచేస్తానని ప్రకటించడం వారి ఆనందం రెట్టింపైంది. బీసీలకు భరోసా, భద్రత కల్పిస్తామన్నారు. పలు బీసీ కులాల గ్రూపుల్లో మార్పులుచేర్పులు చేస్తానని, సామాజికవర్గాల్లో మార్పులు చేస్తానని చంద్రబాబు చెప్పి చేయలేకపోయిన వైనాన్ని వివరించారు. (జగన్‌ అనే నేను.. మీ బిడ్డగా..)

బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపే విషయంలో జరిగిన మోసాన్ని తెలిపారు. ఇటువంటి బిల్లులు పెట్టేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయంగా చేయగలిగింది చేస్తానని, నీతిగా, నిజాయితీగా నిజం చెబుతున్నానని చెప్పినప్పుడు బీసీల మంచి స్పందన లభించింది. పాదయాత్రలో ఎంతో మంది బీసీలు తమ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మనస్సు కలిచివేసేదని, అవన్నీ చూసిన తర్వాతే బీసీలకు ఎంతవరకైనా చేయాలనే ఆలోచన వచ్చినట్లు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లలను స్కూలుకు పంపిస్తే ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పినప్పుడు తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు తాను ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకుంటున్నారని, ఏవేవి కాపీ కొట్టాడో వైఎస్‌ జగన్‌ సభలో వివరించారు. చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడంతో చప్పట్లు మారుమోగాయి. (వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక)

31 బీసీ కులాలు ఓబీసీలోకి రాకపోవడంతో కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఈ విషయమై ఇంతకాలం బీజేపీతో కాపురం చేసిన వ్యక్తి కేంద్రానికి ఉత్తరమైనా రాయలేదన్నారు. బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారికి 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తానని ఇచ్చిన హామీ బీసీల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పటివరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదనుకుంటున్నామని, జగనన్నతో అది సాధ్యమవుతుందని సభకు వచ్చిన ప్రజలు చెప్పుకున్నారు. మత్స్యకారులకు, చేనేతలకు, కార్మికులకు, యాదవులకు, పాల రైతులకు ఇచ్చిన హామీలు వారిని ఆకర్షించాయి. సంచార జాతులకు ఇళ్లు కట్టించి, ఉపాధి కూడా చూపిస్తామని చెప్పిన వ్యక్తి ఇప్పటివరకు జగన్‌ ఒక్కరేనని చెప్పవచ్చు. ప్రత్యేకించి వారి పిల్లలకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 బీసీ కులాలను తెలంగాణలో ఓసీలుగా పరిగణిస్తున్నారని, అధికారంలోకి రాగానే కేసీఆర్‌తో మాట్లాడి 32 కులాలను బీసీలుగా గుర్తించే బాధ్యత తీసుకుంటానని వారిలో ఆనందం నింపారు.  

మరిన్ని వార్తలు