చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం

18 Nov, 2023 05:53 IST|Sakshi

స్కాంలో అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర 

టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం 

దీన్ని కాగ్‌ సైతం ధ్రువీకరించింది

కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది

ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు

హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్‌

తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం  జరిగిందని సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ చేశారని, తద్వారా పలు డిస్టిలరీలకు, బార్‌లకు లబ్ధి చేకూర్చారని ఆయన వివరించారు. ఇందులో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నిందితులకు సైతం సంబంధం ఉందన్నారు.

వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్‌ సైతం తేల్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్వలాభం కోసం, డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారని శ్రీరామ్‌ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్రకు డబ్బు అందిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముందస్తు బెయిల్‌ పేరుతో దాఖలు చేసిన ఈ పిటిషన్‌.. క్వాష్‌ పిటిషన్‌ రీతిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయాన్ని తేల్చాలన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుకు సహకారం
మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర.. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ మల్లికార్జునరావు విచారణ జరిపారు. రవీంద్ర తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్‌ పేరు లేదన్నారు. సీఐడీ మాత్రం కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా చేర్చిందని తెలిపారు.

మంత్రి మండలి నిర్ణయం మేరకే పిటిషనర్‌ వ్యవహరించారన్నారు. ఈ నిర్ణ­యాల వల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలే­దన్నారు. ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తెలిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ తన వాదనల సమయంలో 17ఏ గురించి ప్రస్తావించడంతో దానిపై వాదనలు వినిపిస్తానని, విచారణను వాయిదా వేయాలని పోసాని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు