అయ్యో పాపం..!

26 May, 2018 11:20 IST|Sakshi
పిల్లాడిని ఎత్తుకుని యాచిస్తున్న మహిళ

ముష్టి మాఫియాకు అడ్డాగా చిన బొంబాయి

యాచననే వృత్తిగా మార్చుకుంటున్న ముఠాలు

రోజుకు రూ.150 అద్దెకుపసికందులు

వలస కూలీలు, పేద మహిళలే టార్గెట్‌

రోజంతా మగతగా ఉండేందుకు పసి బిడ్డలు నిద్రమాత్రలు

కొన్నేళ్లుగా చీరాల పట్టణంలో దందాలు

చీరాల: చంకలో పసిబిడ్డ.. చేతికో కాలికో రక్తగాయాలు ఉన్నట్లు కట్లు.. అత్యంత దీన స్థితిలో ఉన్నట్టు భ్రమింపజేసే నటన.. రద్దీగా ఉండే కూడళ్లలో యాచన. ఇది నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌ వంటి నగరాల్లో ముష్టి మాఫియా ముఠాలు సాగించే దందా. ఇప్పుడు ఇది చిన్న చిన్న పట్టణాలకూ పాకింది. పసి బిడ్డలను అడ్డుపెట్టుకుని సాగించే యాచక వృత్తి అధికమవుతోంది. పసి బిడ్డలను అద్దెకు తీసుకుని చీరాలకు చెందిన కొందరు మహిళలు బిక్షాటన సాగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటుగా తెలంగాణ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చే పేద మహిళలను, అలానే స్థానికంగా కొన్ని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగించే కుటుంబాలను కొందరు టార్గెట్‌ చేస్తున్నారు.

పేదల బిడ్డలకు రోజుకు రూ.150 చెల్లించి అద్దెకు తీసుకుంటున్నారు. ఆ పసిపిల్లలను చంకలో పెట్టుకుని చీరాల, ఒంగోలు పట్టణాలతో పాటుగా, రైళ్లు, బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాచక వృత్తి సాగిస్తున్నారు. ముఖ్యంగా చీరాల పట్టణంలో ఇలాంటి సంఘటనలు అధికంగా ఉన్నాయి. వలస కూలీలు అధికంగా ఉండటానికి తోడు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉండటంతో ఇటువంటి నీచ వ్యాపారానికి చీరాల అడ్డాగా మారింది.

చీరాల ప్రాంతం నుంచి రోజుకు సుమారు 70 మంది వరకు చిన్నారులను అద్దెకు తీసుకుని యాచక వృత్తి చేస్తున్న ముఠా ఉంది. చినబొంబాయిగా పేరుగాంచిన చీరాలకు ఆంధ్ర, తెలంగాణా, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు నివాసం ఉంటారు. వీరిలో తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా పట్టణంలోని విజిలిపేట, రైల్వేగూడ్స్‌ షెడ్, సెయింటాన్స్‌ స్కూల్‌ సమీపం, పట్టణ శివారు కాలనీల్లో నివసిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వీరిలో కొంత మంది వివిధ వ్యాపార సముదాయాల్లో కూలీ పనులు చేసుకుంటుండగా కొందరు మాత్రం తమ పిల్లలను చిత్తు కాగితాలు ఏరిపించడం, చిన్నపిల్లలను అడుక్కోవడానికి రోజుకు అద్దెకు ఇస్తున్నారు.

పసి పిల్లలు రోజంతా ఏడవకుండా ఉండేందుకు వారికి మత్తుమందులు ఇచ్చి చంకలో పెట్టుకుంటారు.  8 నుంచి 12 ఏళ్ల వయస్సు వారిని మాత్రం చేతులు, కాళ్లు విరిగినట్లుగా చిత్రీకరించి యాచకవృత్తి చేయిస్తున్నారు. చీరాల పరిసర ప్రాంతాలతో పాటుగా ఒంగోలు పట్టణానికి ప్రతి రోజు రైళ్లు ద్వారా 70 మంది వరకు తమ సొంత పిల్లలు లాగా చిన్నారులను చంకన పెట్టుకుని యాచకవృత్తి సాగిస్తున్నారు. పసిబిడ్డకు రోజుకు రూ.150 అద్దె ఇచ్చి యాచకం చేస్తు వారు మాత్రం వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో ఈ తరహా తంతు కొనసాగుతుంది.

చీరాల కేంద్రంగా అద్దె పిల్లలతో యాచక వృత్తిని గుర్తించాం..:  
జిల్లాలో అధికంగా పసిబిడ్డలను అద్దెకు తీసుకుని యాచక వృత్తి చేయిస్తున్నారు. గతంలోనే వీరిని గుర్తించాం. ప్రధానంగా చీరాలకు ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు వారి అవసరాల కోసం చంటి పిల్లలను అద్దెకు ఇస్తున్నారు. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో చీరాల్లో చాలామంది వ్యక్తులు రోజుకు రూ.150 చెల్లించి వారి పిల్లలను అడ్డుపెట్టుకుని యాచక వృత్తి చేస్తున్నారు. ఇప్పటికే తాము కౌన్సిలింగ్‌తో పాటు పలువురు చిన్నారులను చైల్డ్‌హోంకు తరలించాం. జిల్లాలోని చీరాల్లోనే ఈ తంతు ఎక్కువగా జరగడం బాధాకరం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం.- బీవీ సాగర్, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి, ఒంగోలు.

మరిన్ని వార్తలు