’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం 

21 Oct, 2023 03:12 IST|Sakshi

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు సమర్థన 

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

తాము మార్గదర్శి చిట్‌ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది.  
 

మరిన్ని వార్తలు