బయో థెరపీతో కేన్సర్‌కు చెక్

20 Aug, 2013 04:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బయో థెరపీతో కేన్సర్‌ను నియంత్రించడమే కాకుండా రూపుమాపడానికి అవకాశమూ ఉందని సెల్యులార్ థెరపీ పరిశోధకుడు డాక్టర్ జమాల్ తెలిపారు. ‘బయో థెరపీ-కేన్సర్ నియంత్రణ’ పై బెంగళూరులో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కిమో, రేడియో థెరపీల్లో కేన్సర్ కణాలే కాకుండా వాటి చుట్టు పక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా నాశనం కావడానికి అవకాశాలు ఎక్కువన్నారు. అంతేకాకుండా రోగులపై సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

అయితే బయోథెరపీ విధానంలో రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన తెల్లరక్తకణాలను తీసుకుని వాటి ద్వారా ప్రయోగశాలలో డెన్‌ట్రిటిక్ కణాలను ఉత్పత్తి చేస్తారన్నారు. ఈ కణాలను తిరిగి రోగి శరీరంలో ప్రవేశ పెడుతారన్నారు. ఈ కణాలు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయన్నారు. ఈ విధానంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నూతన విధానంలో రోగికి ఇంటిలోనే చికిత్స అందించడానికి వీలవుతుందని జమాల్ తెలిపారు.

బ్రెస్ట్ కేన్సర్‌తో పాటు బ్రైన్‌మెటాసిస్ వ్యాధికి గురైన సరయూ మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసంతో ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకోగలమన్నారు.  కేన్సర్ ఉన్నా కూడా వైద్యులతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో యాభై ఏళ్ల వయసులో కూడా తాను సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్యులార్ థెరఫీ ప్యాట్రన్ సత్య భూషన్ జైన్ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు