సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేయాలి

8 Dec, 2019 04:52 IST|Sakshi
మాట్లాడుతున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

‘సేవా సంగమం–2019’లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మన ప్రాచీన వ్యవసాయ విధానంలో పండించిన ఆహార పదార్థాలను తినడం వల్ల పోషకాలు పుçష్కలంగా లభించి మంచి ఆరోగ్యాన్ని పొందుతామని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. సేవా భారతి ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సేవా సంగమం–2019 పేరుతో రెండు రోజుల పాటు జరిగే సేవా సంస్థల సదస్సును శనివారం గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పంటకు ఎరువులు, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలపై స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ఎన్‌ చారి మాట్లాడుతూ సేవా సంస్థల నిర్వాహకులంతా కలుసుకోవడం వల్ల విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న ఉద్దేశంతో సేవా సంగమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానందస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత సేవా ప్రముఖ్‌ పరాగ్‌ జీ అభ్యంకర్, ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర ప్రచారక్‌ (ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక) ఆలె శ్యామ్‌కుమార్‌ తదితరులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు సేవా సంస్థల సేవా కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్‌ను మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు