సంపద కేంద్రంలో ప్రకృతి వనం 

25 Sep, 2023 05:18 IST|Sakshi

ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు 

ఎరువులు, పురుగు మందులు వాడకుండా పోషణ 

మొక్కల పెంపకంపై దృష్టి పెట్టిన కంకిపాడు పంచాయతీ 

రానున్న రోజుల్లో ఆదాయ వనరుగా మార్చేందుకు చర్యలు  

కంకిపాడు(పెనమలూరు): అది చెత్త నుంచి     సంపద తయారు చేసే కేంద్రం. నిన్నటి వరకూ ప్రజలకు అంత వరకే తెలుసు. ప్రస్తుతం ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు.

రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సంపద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కంకిపాడు పంచాయతీ పాలకవర్గం పాటుపడుతూ స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది.  మండల కేంద్రమైన కంకిపాడులో గత పాలకపక్షం హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పాలకపక్షం అధికారం చేపట్టాక సంపద వృద్ధి, ఆదాయ వనరుల      పెంపుపై దృష్టి సారించింది. ప్రస్తుతం వర్మికంపోస్టు, పొడి చెత్త విక్రయాలు సాగిస్తున్నారు.  

ప్రకృతి వ్యవసాయం 
సంపద కేంద్రంలో ఉన్న ఖాళీ స్థలంలోనూ        సంపద సృస్టించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం సంపద కేంద్రం ప్రాంగణంలో వృథాగా ఉన్న స్థలాన్ని బాగుచేయించారు. ఆ ప్రాంతంలో వర్మీకంపోస్టు, మట్టి కలిపి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. వంగ, బెండ,  గోరు చిక్కుడు, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, పొట్లను కూడా సాగుచేస్తున్నారు.

వీటికి పందిరి అవసరం లేకుండా ప్రాంగణంలో కొంచెం ఎత్తు మాత్రమే ఉన్న చెట్లకు పాదులను పాకిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర నారుపోసి       సంరక్షించారు. అరటి, జామ, దానిమ్మ, పనస, మామిడి, ఉసిరి వంటి పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు తెగుళ్లు, పురు గుల బారిన పడకుండా నిత్యం పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు, మంచి ఫలసాయం లభించేందుకు ఎప్పటికప్పుడు వర్మికంపోస్టు, సేంద్రీయ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు.  

ఆదాయం పెంపు దిశగా.. 
ఇప్పటికే చెత్త నుంచి సంపద కేంద్రం నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త విక్రయాలు జరుగుతు న్నాయి. వీటి తోపాటుగా అన్ని సీజన్లలో ప్రకృతి విధానంలో కూరగాయ మొక్కలను పెంచి వాటి ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు పంచాయతీ చర్యలు తీసుకుంది. వర్మీకంపోస్టు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు ఆర్గానిక్‌ కూరగాయలకు ఆసక్తి చూపుతారు. అదే ఉద్దేశంతో ప్రకృతి విధానాన్ని సంపద కేంద్రంలో అమలు చేస్తోంది.  

ఆర్గానిక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ 
ప్రస్తుతం ఆర్గానిక్‌ ఉత్పత్తులను మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ     పెరిగాయి. ఆర్గానిక్‌ పద్ధతిలో పెరిగిన కూరగాయలను భుజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కారణంతో ఆర్గానిక్‌ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని నిర్ణయించుకున్నాం. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని మొక్కల పెంపకానికి వినియోగి స్తున్నాం. కేంద్రం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు పెంచి విక్రయించటం ద్వారా పంచాయతీకి కూడా ఆదాయం సమకూరుతుంది.   – రాచూరి చిరంజీవి, ఉప సర్పంచ్, కంకిపాడు 
 

మరిన్ని వార్తలు