మామిడికి చేదు కబురు

24 Jun, 2015 04:40 IST|Sakshi
మామిడికి చేదు కబురు

 సాక్షి, చిత్తూరు : అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది జిల్లా నుంచి వేల టన్నుల మామిడి  విదేశాలకు ఎగుమతి అవుతుందని కలెక్టర్ మొదలు అధికారులందరూ ప్రకటించారు. వేల టన్నుల సంగతి దేవుడెరుగు ఇప్పటివరకు పట్టుమని 15 టన్నులు కూడా ఎగుమతికి నోచుకోలేదు. శ్రీని ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి వేపర్ వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అధికారుల సమాచారం మేరకు జిల్లా నుంచి ఇప్పటివరకు కేవలం 11.5 టన్నుల మామిడి మాత్రమే సింగపూర్, యూకే  దేశాలకు ఎగుమతి అయ్యింది.

మరో మూడు టన్నుల మామిడి ప్రాసెసింగ్ పూర్తి చేసుకుని వారంలో జపాన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సీజన్ ముగుస్తుండడంతో మరో ఐదు టన్నులకు మించి ఎగుమతులు ఉండకపోవచ్చు. అయితే ఉద్యానవన శాఖాధికారులు ఇప్పటికే 300 టన్నులు ఎగుమతి అయ్యిందని, మరో 500 టన్నులు వెళ్లనుందని కాకిలెక్కలు చెబుతుండడం గమనార్హం. జిల్లాలో 76 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. గత ఏడాది 5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. వర్షాభావం, మరోవైపు అకాల వర్షం కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గినా 4 నుంచి 5 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.

ఇందులో బేనిషా 1.8 లక్షల టన్నుల వరకూ ఉంటుంది. విదేశీ ఎగుమతులు పెంచేందుకు తిరుపతిలోని మామిడి ప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రభుత్వం తెరిపించింది. ఎగుమతులు పెరుగుతాయని రైతులు ఆశపడ్డారు. ఇప్పటివరకు కేవలం 11.5 టన్నులే ఎగుమతి అయ్యింది. ఎగుమతులు, క్వాలిటీకి సంబంధించి జపాన్, సింగపూర్, న్యూజిలాండ్, యురోపియన్ యూనియన్ దేశాల వ్యాపారులతో ప్రభుత్వ పరంగా ఇక్కడి అధికారులు చర్చించిన దాఖలాలు లేవు. కనీస చర్యలు కూడా తీసుకోకుండా వందలాది టన్నులు ఎగుమతి చేసినట్లు అధికారులు డప్పు కొట్టడంపై రైతులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు