వేట కొడవళ్లతో దాడి | Sakshi
Sakshi News home page

వేట కొడవళ్లతో దాడి

Published Wed, Jun 24 2015 4:46 AM

వేట కొడవళ్లతో దాడి - Sakshi

మదనపల్లె రూరల్ : అల్లనేరేడు చెట్టు కోసం దాయాదులు ఘర్షణ పడ్డారు. పినతండ్రి, పినతల్లిపై వేట కొడవళ్లతో దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితులను 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన తంబళ్లపల్లె మండలం రెడ్డికోటలో సోమవారం జరిగింది. ఇట్నేని ఎల్లప్ప (46), ఇట్నేని వేమనారాయణలు అన్నదమ్ములు. పెళ్లయిన నాటి నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. రెండు కుటుంబా ల మధ్య ఉమ్మడిగా పెంచిన ఒక అల్ల నేరేడు చెట్టు ఉంది.

ఈ ఏడాది అల్లనేరేడు కాయలు పక్వానికి రావడంతో వేమనారాయణ కుమారుడు నరసింహులు రెండు రోజుల క్రితం కాయలు కోసి విక్రయించాడు. భాగం పంచకుండానే కాయలు ఎందుకు కోశావని నరసింహులును ప్రశ్నించగా వాగ్వాదానికి దిగాడు. గొడవ పడడం ఇష్టం లేక సోమవారం ఎల్లప్ప తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసి ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అన్న కుమారులు నరసింహులు, వెంకట్రమణ, ప్రసాద్, సురేంద్రలు ఒక్కసారిగా పిన తండ్రి ఎల్లప్ప ఇంటిపైకొచ్చి వేటకొడవళ్లతో నరికారు.

అడ్డుకున్న పినతల్లి రెడ్డిలక్ష్మిని నరకడంతో ఇద్దరు రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయారు. ఘటనపై గ్రామస్తులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించి క్షత్రగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎల్లప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement