నా తర్వాతే నరేంద్రమోదీ

21 Sep, 2018 03:42 IST|Sakshi

గుజరాత్‌ను ఆంధ్ర దాటిపోతుందని ఆయన భయం

ఈ ప్రధాని హయాంలో దేశాభివృద్ధి లేదు

రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు వడ్డీతో సహా వసూలు చేస్తాం

దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం

జ్ఞానభేరి సభలో సీఎం చంద్రబాబునాయుడు

సాక్షి, విజయవాడ: ‘నా తర్వాతే ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చారు.. నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్‌ని.. నేను 1995లో సీఎం అయితే, ఏడేళ్ల తర్వాత 2002లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే అవకాశం రావడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారని గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కృష్ణా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జ్ఞానబేరి’ సభలో అన్నారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రానికి న్యాయం చేస్తారనుకుంటే నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా అన్ని చేస్తామని నమ్మకంగా చెప్పి, నాలుగు ఏళ్లు ఏమీ పట్టించుకోకుండా నట్టేట ముంచారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూత ఇస్తే గుజారాత్‌ను దాటిపోతుందని నరేంద్రమోదీ భావించారన్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని మనకు న్యాయం చేయలేదని, అయినా మన రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని అన్నారు.

నరేంద్రమోదీ వచ్చిన తరువాత దేశం అభివృద్ధి ఆగిపోయిందని అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరిగిపోయాయని, నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి పనులు చేయడం లేదని సీఎం దుయ్యబట్టారు. దక్షిణ భారత దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ పన్నులు వెళుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దమౌతోందన్నారు.

విభిన్న స్టేట్‌మెంట్స్‌.....
భారతదేశంలో జరిగిన అభివృద్ధికి మనమే చిరునామా.. జీఎస్టీపీ గ్రోత్‌ రేట్‌ బాగా పెరిగింది. కేంద్రం సహకరించకపోయినా రెండంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం మనదేనని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు ఉన్న ఎకానమినీ ఒక ట్రిలియన్‌ ఎకానమీగా తీసుకువెళతామని చెప్పారు. మరొక సందర్భంలో మాట్లాడుతూ కేంద్రం సహకరించక పోవడంతో వల్ల దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడి పోయామని చెప్పారు. దీనిపై ధర్మ పోరాటం కొనసాగిస్తామన్నారు.

రాష్ట్రానికి రావాల్సింది వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. అమరావతికి ప్రపంచంలో గుర్తింపు ఉన్న యూనివర్శిటీలను  తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్ధి కె.ఈశ్వరసాయి ‘ఒన్‌ టచ్‌ ఈ గవర్నన్స్‌’ అనే యాప్‌ తయారీ గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై పవన్‌ చక్రధర్, కుమారి రిషిత డెయిరీ టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు