Salman Khan: స్టార్‌ హీరోకు కలిసొచ్చిన దీపావళి.. తొలిరోజే భారీ వసూళ్లు.. థియేటర్‌లో ఫ్యాన్స్‌ రచ్చ

13 Nov, 2023 10:48 IST|Sakshi

సెలబ్రిటీలంటే పడి చచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. వారి సినిమా రిలీజైందంటే చాలు పండగ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు వీళ్ల వల్ల అవతలివారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా అదే జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం టైగర్‌ 3. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతగానో ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో సినిమా రిలీజవడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్‌ల ముందు భారీ కటౌట్లు పెట్టి టపాకాయలు పేల్చి నానా హంగామా చేశారు.

థియేటర్‌లో బాణసంచా కాల్చడం నిషేధం.. అయినా
కానీ కొందరు అత్యుత్సాహంతో థియేటర్‌ లోపల బాణసంచా కాల్చి రచ్చ చేశారు. కొందరు ఇలా పటాసులు కాల్చడాన్ని ఎంజాయ్‌ చేస్తూ విజిల్స్‌ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'దీపావళి పండగను సల్మాన్‌ సినిమాతో సెలబ్రేట్‌ చేసుకున్నాం.. ఇది కదా మాకు కావాల్సింది' అని సల్లూభాయ్‌ అభిమానులు చెప్తుండగా.. ఇలా థియేటర్‌లో బాణసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా సరే దాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఇతరులకు అసౌకర్యానికి గురి చేస్తున్నారు అని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టైగర్‌ 3కి తొలిరోజే భారీ వసూళ్లు
ఇలా చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పొరపాటున సీట్లకో, కార్పెట్‌కో నిప్పు అంటుకుంటే జరగరాని నష్టం జరుగుతుందని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహిస్తున్నారు. మహారాష్ట్ర మాలేగావోన్‌లోని మోహన్‌ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించిన టైగర్‌ 3 సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ కీలకపాత్రలో నటించాడు. షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో మెరిశాడు. టైగర్‌ 3 సినిమా సల్మాన్‌కు భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే తొలి రోజు రూ.44 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. మరి రానున్న రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్‌ వసూలు చేస్తుందో చూడాలి!

చదవండి: అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు దూరమయ్యానంటే: వెంకట్ అక్కినేని

మరిన్ని వార్తలు