నల్ల కోళ్ల పెంపకం లాభదాయకం

24 Jan, 2019 13:30 IST|Sakshi
కోమటినేనివారిపాలెం షెడ్‌లో పెంపకంలో ఉన్న నల్లకోళ్లు

ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యం

గుడ్డు ధర రూ.50,   కిలో మాసం రూ.1,000

కోడి, మాంసం అన్నీ నలుపు రంగే

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: కోడి రంగుతో పాటు మాంసం కూడా నలుపురంగు లోనే ఉంటుంది. కోడి పెట్టే గుడ్డు మినహా శరీరంలోని అవయవాలన్నీ నలుపురంగులోనే ఉండటం ప్రత్యేకం. ఈ కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. వైద్య శాస్త్రవేత్తల సూచనలతో ఒక విద్యావంతుడు ఈ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. వీటి గురించి పశువైద్యాధికారి డాక్టర్‌ మల్లయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కఢక్‌నాథ్‌ నల్ల కోళ్లు
చిలకలూరిపేట రూరల్‌ మండలంలోని గంగన్నపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోరంట్ల పిచ్చయ్య ఎంబీఎ(హెచ్‌ఆర్‌), ఎంఎస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బీఈడీ ఉన్నత విద్యను అభ్యసించి ఒక సంస్థలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీ పనుల నిమిత్తం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కఢక్‌నా«థ్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే నల్లరంగులో ఉన్న కోడిపెట్టలు, పుంజులను  పరిశీలించారు. కోళ్లను పెంచుతున్న రైతులతో మాట్లాడితే మరొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వీటి మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, క్షీణించిన ఆరోగ్యం కూడా మెరుగవుతుందని తెలియచేశారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక పిచ్చయ్య ఈ కోళ్ల గురించి పసుమర్రు పశువైద్యాధికారి డాక్టర్‌ మల్లయ్యను సంప్రదించారు. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో ఉన్న కోళ్లను, పశు సంవవర్థక శాఖకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులను సంప్రదించారు. కఢక్‌నా«థ్‌ ప్రాంతంలోని కోళ్ల పెంపకందారులు తెలిపినవి వాస్తవమేనని గుర్తించారు. వెంటనే పిచ్చయ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కోళ్లఫారం ఏర్పాటు చేశారు.

చిరు ప్రయత్నం ప్రారంభం ...
గ్రామంలో తనకు చెందిన కొద్దిపాటి స్థలంలో చిన్న షెడ్డును ఏర్పాటు చేసి కఢక్‌నా«థ్‌ నుంచి ఒక్కో గుడ్డును రూ.50 చొప్పున, కేజీ బరువు ఉన్న కోడిని రూ.1,000 చొప్పున మొత్తం 50 కోళ్లు, 10 గుడ్లు, రెండు పుంజులను కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అక్కడి కోళ్లు స్థానిక వాతావరణానికి అనుగుణంగా అలవాటయ్యేందుకు వాటితో పాటు స్థానిక కోళ్లను కొన్నింటిని కొనుగోలు చేశారు. రెండింటినీ కలిపి ఒక షెడ్డు ఏర్పాటు చేసి వాటిలో పెంపంకం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు.

నల్లకోడి మాంసంతో ఆరోగ్యం
కఢక్‌నాథ్‌కు చెందిన నల్ల కోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పక్షవాతం, గుండెనొప్పి, రక్త ప్రసరణ, ఆరోగ్యం క్షీణించిన వారికి ప్రత్యేక ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు ఈ కోడిమాంసం ఆహారంగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కోడి గుడ్డును తీసుకుంటే పౌష్టికాహారంగా ఉంటుందని చెబుతున్నారు.

ఒక్క కోడి 80 గుడ్లు ...ఆరున్నర సంవత్సరాలు
సాధారణంగా స్థానికంగా ఉండే కోళ్లు 25 నుంచి 35 గుడ్లు మాత్రమే పెట్టి వాటినే పొదిగి పిల్లలను పెంపొందింప చేస్తాయి. ఇందుకు భిన్నంగా కఢక్‌నాథ్‌ నల్లకోళ్లు మాత్రం 75 నుంచి 80 గుడ్లను పెడతాయి. స్థానిక కోళ్ల జీవితకాలం  కేవలం నాలుగున్నర ఏళ్లు మాత్రమే. కఢక్‌నా«థ్‌ కోళ్లు ఆరున్నర ఏళ్లు జీవిస్తాయి. పిచ్చయ్య తీసుకువచ్చిన కోళ్లు  ఆరు సంవత్సరాలు గడిచినా నేటికీ ఆరోగ్యంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

స్వయం పర్యవేక్షణ...
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కఢక్‌నా«థ్‌ కోళ్లను నిత్యం పర్యవేక్షిస్తూ షెడ్‌లో వాటికి అవసరమైన ఆహారం, నీరు, వ్యాధి నిరోధక జాగ్రత్తలు తీసుకుంటే పెంపకందారులకు ఆదాయం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో కోడి మాంసం ధర కిలో రూ.1,000 ఉంటే ఒక్కో గుడ్డు ధర రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.

నల్ల కోడి మాంసంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కఢక్‌నాథ్‌ ప్రాంతానికి చెందిన నల్లకోళ్ల గురించి తెలిసి, స్వయంగా వెళ్లి పరిశీలించాం. వీటిపై అనేకమంది పశుసంవర్థక శాస్త్రవేత్తలు, వైద్య విభాగంలోని ప్రొఫెసర్‌లను సంప్రదించాం. నల్లకోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే మానవుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. పక్షవాతం, గుండెజబ్బులు ఉన్న వారికి ఈ మాంసం ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది. పెంపకందారులకు ఆదాయం కూడా బాగుంటుంది.–డాక్టర్‌ సీహెచ్‌ మల్లయ్య, పశు వైద్యాధికారి, పసుమర్రు

మరిన్ని వార్తలు