బతుకు చిత్రాలకు ఉత్తమ స్థానాలు 

6 Nov, 2023 05:03 IST|Sakshi

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రాకళా పోటీలు, ప్రదర్శన ఆదివారంతో ముగిశాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, బిహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల చిత్రకారులు వేసిన 189 పెద్దచిత్రాలను ప్రదర్శించారు. గుంటూరు చిత్రకారుడు వస్తగిరి జస్టిస్‌ వేసిన సజీవ చిత్రానికి మొదటి బహుమతి దక్కింది.

కోల్‌కతాకు చెందిన రాజేష్‌ వేసిన స్వీయ జీవన చిత్రం ద్వితీయ బహుమతిని, చెన్నైకి చెందిన చిత్రకారుడు గణేషన్‌ జీవితంలో సొంతవారి కోసం నిరీక్షిస్తున్నట్టు వేసిన సజీవ చిత్రం తృతీయ బహుమతిని పొందాయి. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు వేసిన బెంగళూరు చిత్రకారుడు దేవీప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. మెగా అవార్డును రాజు (రాజమండ్రి),  ప్రత్యేక బహుమతులను చక్రపాణి (హైదరాబాద్‌), కె.భాస్కరావు (పాలకొల్లు), అన్నామలై (చెన్నై), కరుణాకర్‌ (విజయనగరం), విజయ్‌ (హైదరాబాద్‌) పొందారు.

ఈ పోటీలకు ప్రముఖ చిత్రాకారులు ఎం.సుబ్రహ్మణ్యం, కె.రామ్మోహన్‌రావు, వీవీ కోటేశ్వరరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రదర్శన నిర్వాహకుడు, చిత్రకళా నిలయం చిత్రకారుడు బొడ్డేడ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో విశాఖ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ బి.రామనరేష్‌ పాల్గొని బహుమతులు అందజేశారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న దేవీప్రసాద్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. 

మరిన్ని వార్తలు