గోదావరి నదిలో పడవ బోల్తా

14 Jul, 2018 17:18 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీ కొట్టడంతో ఓ పడవ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతయ్యారు. ఐ.పోలవరం మండలంలోని సలాదివారి పాలెం నుంచి పశువుల్లంకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దాదాపు 30 మంది ప్రయాణీకులతో పశువుల్లంకకు వెళ్తుండగా నది ఒరవడికి పక్కకు వెళ్లిన పడవ పిల్లర్‌ను ఢీ కొట్టినట్లు తెలిసింది. నదిలో కొట్టుకుపోతున్న కొందరిని స్థానికులు చిన్నపడవలో వెళ్లి రక్షించారు. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమజ్ఞమయ్యారు.

వనం-మనం కార్యక్రమం కోసం రెండో శనివారం అయినా పాఠశాలకు విద్యార్థులను ప్రభుత్వం రప్పించింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరై పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు గోదావరి పుష్కరాల సందర్భంగా 30 మంది తొక్కిసలాటలో మృతి చెందారు. అప్పుడు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులు మాట్లాడుతూ.. పిల్లర్‌ను ఢీ కొట్టిన అనంతరం పడవ తిరగబడినట్లు చెప్పారు. స్థానికులు మరో పడవలో వచ్చి తమను రక్షించాడని ఓ బాలుడు చెప్పగా, కుటుంబసభ్యులు, వారి స్నేహితులతో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని ఓ బాలిక చెప్పింది.

బోల్తా తర్వాత తాను ఎలా బయటపడ్డనో తెలీయదని బాలిక వివరించింది. కళ్లు తెరచి చూసే సరికి ఒడ్డున ఉన్నానని వెల్లడించింది. ప‌డ‌వ ప్ర‌మాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల‌కు త‌క్ష‌ణం స‌హాయం అందించాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు సూచించారు. ఘటనతో అలర్ట్‌ అయిన రాష్ట్ర విపత్తుల శాఖ సహాయక చర్యల కోసం రాజమండ్రి, విశాఖపట్టణంల నుంచి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపింది.

ప‌డ‌వ‌ ప్ర‌మాదంలో గ‌ల్లంతైన‌ట్లుగా అనుమానిస్తున్న‌వారి పేర్లు

1. కొండేపూడి ర‌మ్య    -10వ త‌ర‌గ‌తి

2. పోలిశెట్టి వీర మ‌నీష -10వ త‌ర‌గ‌తి

3. సుంక‌ర శ్రీజ          - 4వ త‌ర‌గ‌తి

4. సిరికోటి  ప్రియ       - 8వ త‌ర‌గ‌తి

5. పోలిశెట్టి అనూష     - 9వ త‌ర‌గ‌తి

6. పోలిశెట్టి సుచిత్ర      - 6వ త‌ర‌గ‌తి

గల్లంతైన వారందరూ ప‌శువుల్లంకలోని పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. వీరంద‌రూ శేరిలంక‌, కే. గంగ‌వ‌రం, పామ‌ర్ల మండ‌లాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు