క్షుద్ర పూజల కలకలం.. నర బలి ఇచ్చారా..?

22 Oct, 2023 11:26 IST|Sakshi

తూర్పు గోదావరి: మండలంలోని వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్‌ చేయగా ఫోన్‌ కలవలేదని సమాచారం.

ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్‌ సైకిల్‌ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది.
 
తలపై బలమైన గాయం 
వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, మండపేట రూరల్‌ సీఐ కె.శ్రీధర్‌ కుమార్‌ కూడా అక్కడకు చేరుకున్నారు.

వెంకట రమణకు ఎవరితోనైనా పాత కక్షలున్నాయా, వివాహేతర సంబంధం వంటి కారణాలు, రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు, అతడి వెంట ఎవరున్నారు, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, హత్యకు అసలు కారణాలేమై ఉంటాయనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు.

వెంకట రమణకు భార్య విజయలక్షి్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి వరకూ అందరితో మాట్లాడిన అతడు ఉదయానికి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాము ఎలా జీవించాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సంఘటనపై భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు