తెల్ల బోవాల్సిందే

4 Aug, 2014 02:39 IST|Sakshi
తెల్ల బోవాల్సిందే

 విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో మొత్తం 6లక్షల 81వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆరు లక్షల పైచిలుకు తెల్ల రేషన్ కార్డులే! ఈ మొత్తం కార్డుల్లో  బోగస్ కార్డులు లక్ష వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు రచ్చబండ-3లో 56,944 కార్డులు మంజూరు చేశారు. వీటికి కూపన్ల ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు. ఈ కూపన్లను పంపిణీ చేసేందుకు గ్రామాల్లోకి వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగినట్టయింది. ఎందుకంటే కార్డులు మంజూరైన వారిలో  8412 మంది గ్రామాల్లో లేరు. లేనివారికి కార్డులేమిటని ప్రశ్నిస్తే వలస వెళ్లారని, వస్తున్నారని గ్రామాల్లో ఉన్న నాయకులు చెప్పడంతో వాటిని మళ్లీ తీసుకువెళ్లినా అదే పరిస్థితి! దీంతో 56,944 కార్డులు మంజూరైనా 48,532 కార్డులకు  మాత్రమే కూపన్లు పంపిణీ చేసి మిగతా కార్డుల కూపన్లను తీసుకు వచ్చేశారు.  
 
 రాజకీయ ఒత్తిళ్లకు చెల్లు!
 గతంలో రేషన్ కార్డులను  తనిఖీలు చేసి బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేసేందుకు సిఫారసు చేసినపుడు అధికారు లు రాజకీయంగా ఒత్తిళ్లను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఇప్పు డా పరిస్థితి ఉండదని అధికారులు భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను గుర్తించేందుకు ఇప్పుడు ఆధార్ సీడింగ్ ఒక్కటే మార్గం!  ఈ ప్రక్రియలో బోగస్ రేషన్ కార్డులు ఇప్పుడు గుర్తిస్తే ఉండే రాజకీయ ఒత్తిడి ఉండక పోవచ్చని భావిస్తున్నారు. సివిల్ సప్లైస్‌లో సరుకులను పొందుతున్న జిల్లాకు చెందిన పలువురు తెలుపు రేషన్ కార్డు దారులు బోగస్ కార్డులను కలిగి ఉన్నారు.
 
 జిల్లానుంచి వేలాది మంది ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉన్నారు. అటువంటి వారు అక్కడ కూడా కార్డులు పొంది ఉన్నారు. ఇక్కడా వారికి కార్డులు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల మధ్య ఉన్నప్పటికీ రేషన్‌కార్డులకు అనుసంధానం చేసే ఆధార్ కార్డు జాతీయ స్థాయిలో ఒకే సంఖ్య ఉంటుంది కనుక ఇటువంటివి కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విధానం అమలై ఒక కుటుంబం ఒకే రేషన్ కార్డు పొందడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అంటున్నారు.
 
 డీలర్లు, తాకట్టు వ్యాపారుల్లో గుబులు!
 జిల్లాలోని రేషన్‌కార్డుల్లో బోగస్ ఏరివేత జరుగుతుందని తెలిసి డీలర్లు, తాకట్టు దారులు అయోమయంలో పడ్డారు. తమ వద్ద ఇన్నాళ్లూ ఉన్న కార్డులు ఇక కనుమరుగు కానున్నాయని గుబులు చెందుతున్నారు. బోగస్ రేషన్ కార్డులు డీలర్ల వద్ద ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని గ్రామాలు, పట్టణాల్లో వ్యాపారుల వద్ద తాకట్టులో ఉన్నట్లు తెలుస్తోంది. బోగస్ ఏరివేత జరిగితే ఈ కార్డుల్లో చాలావరకూ రద్దవుతాయి. దీంతో ఇంతవరకూ వాటి ఫలితాన్ని అనుభవించిన వారికి ఇక ఆదాయం మరి రాదనే గుబులు పట్టుకుంది.
 

మరిన్ని వార్తలు