ఖదీర్‌.. నువ్వు బతకాలి !

1 Sep, 2019 12:19 IST|Sakshi
కుమారుడిని కాపాడాలంటూ వేడుకుంటున్నతల్లిదండ్రులు, కేన్సర్‌ బారిన పడిన బాలుడు

సాక్షి, జమ్మలమడుగు(కడప) : అందరినీ నవ్వుతూ పలకరిస్తూ.. ఉల్లాసంగా తిరిగే ఆ అబ్బాయికి అకస్మాత్తుగా కేన్సర్‌ అని తేలింది. ఆ వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కష్టం చేసి కూడబెట్టుకున్న అంతో ఇంతో డబ్బుతో చికిత్స చేయించారు. కానీ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే రూ.40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తమ కుమారుడిని బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. జమ్మలమడుగు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అచ్చుకట్ల హుస్సేన్‌ పీరా, అచ్చుకట్ల మస్తాన్‌ బీ దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో పెద్దకుమారుడు అచ్చుకట్ల అబ్దుల్‌ ఖదీర్‌. రెండేళ్ల క్రితం 8వతరగతి చదివేవాడు.

ఆ సమయంలో అనారోగ్యం బారినపడటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్లడ్‌ కేన్సర్‌గా గుర్తించారు. ప్రాథమిక దశలో  ఉండటంతో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కొంత మెరుగుపడింది. తమ కుమారుడు కోలుకున్నాడని ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఇంతలోనే ఇటీవల తిరిగి తీవ్రమైన జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చూపించారు. కేన్సర్‌ పూర్తి స్థాయిలో నయం కావాలంటే కనీసం రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు.  దీంతో హైదరాబాద్‌నుంచి తల్లిదండ్రులు భారంగా  తమ కుమారుడు అబ్దుల్‌ ఖదీర్‌ను స్వగ్రామానికి తీసుకుని వచ్చారు.   

దాతలు కరుణించాలి..
కష్టం చేసి జీవనం సాగించేవాళ్లం. మా కుమారుడికి బ్లడ్‌ కేన్సర్‌ నయం కావాలంటే కనీసం 40 లక్షల రూపాయలు అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అంత డబ్బులు మా దగ్గర లేవు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. మా కుమారుడిని బతికించుకోవాలని ఉన్నా నిస్సహాయులంగా ఉండిపోవాల్సి వస్తోంది. దాతలు కరుణించి నా కుమారుడి ప్రాణం నిలబెట్టాలి.
– అచ్చుకట్ల హుస్సేన్‌ పీరా. 

మరిన్ని వార్తలు