గాల్లో దీపం.. తెలుగుదేశం

29 Apr, 2014 01:45 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పరిస్థితి గాల్లో దీపంలా మారింది. ఎక్కడా పరిస్థితి అనుకూలంగా లేదు. ముగిసిన శాసనసభలో హైదరాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయిన టీడీపీకి ఈసారీ అదే పరిస్థితి పునరావృతం కానుందా..? అనేది టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే ఇక రాజధానిలో పార్టీ జెండాను చుట్టేయక తప్పదనే వ్యాఖ్యానాలూ వినపడుతున్నాయి.

2009 ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయిన టీడీపీ.. ఈసారి జిల్లానుంచి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మిగతా స్థానాలు బీజేపీకి కేటాయించింది. వీటిల్లో నాలుగు చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, నాంపల్లి స్థానాలు ఇప్పటికే ఎంఐఎం ఖాతాలోవి కావడంతో, ఈసారీ అక్కడ గెలుపుపై ఆశల్లేవు.

మిగిలిన నాలుగింటిలో జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లున్నాయి. జూబ్లీహిల్స్‌లో స్థానికేతరునికి టిక్కెట్ కేటాయించారంటూ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి ఉంది. యూసుఫ్‌గూడ కార్పొరేటర్ మురళిగౌడ్ పార్టీకే గుడ్ బై చెప్పి.. టీఆర్‌ఎస్ నుంచి రంగంలోకి దిగారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో తమ సత్తా చూపాలని భావిస్తున్నారు.
 
శ్రమించినా.. విజయం దక్కేనా..
 
సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్.. గతంలో పోటీ చేసిన సికింద్రాబాద్‌ను కాదని సనత్‌నగర్‌ను ఎంచుకున్నప్పటికీ, పరిస్థితి అనుకూలంగా లేదు. ఎదురీదాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎంతోకాలంగా క్షేత్రస్థాయిలో బలాన్ని సమీకరించుకున్న కూన వెంక టేశ్‌గౌడ్‌కు సనత్‌నగర్ కాకుండా సికింద్రాబాద్ కేటాయించడంతో, ఆయన వర్గీయులు తలసానికి సహకరించే పరిస్థితి లేదు. ఇక సికింద్రాబాద్ టిక్కెట్ దక్కించుకున్న వెంకటేశ్‌గౌడ్‌కు సైతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  

టిక్కెట్ వచ్చాక మాత్రమే నియోజకవర్గంలో ప్రవేశించిన ఆయనకు ప్రచారానికి తగినంత సమయం లేకుండా పోయింది.  మరోవైపు టీఆర్‌ఎస్  నుంచి గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి జయసుధ రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత శక్తితోనే నమ్ముకున్న ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన మేకల సారంగపాణి కూన వెంకటేశ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండటం కొంత కలిసివచ్చే అంశం. కంటోన్మెంట్‌లో సాయన్న సైతం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.  
 
దిక్కులేని వైనం..

 
వాస్తవానికి జిల్లాలో పార్టీకి దిక్కంటూ లేకుండా పోయింది. అభ్యర్థులను గెలిపించేం దుకు గతంలోలా రాష్ట్ర కార్యాలయం నుంచి  నియోజకవర్గాల పరిశీలకులు.. ఇతరత్రా సమన్వయకర్తలు, ప్రచార వ్యూహకర్తలుగానీ లేరు. జిల్లా అధ్యక్షుడు తన పరిస్థితే క్లిష్టంగా ఉండటంతో ఇతర అభ్యర్థులను పట్టించుకోవడం లేరు.ఈ నేపథ్యంలో పార్టీకి దిక్కూమొక్కూ లేకుండా పోగా.. రంగంలోని అభ్యర్థులు సొంత కృషినే నమ్ముకున్నారు. పార్టీ పరిస్థితి గాల్లో దీపంలా మారడంతో.. ఓటరు దేవుళ్లే దిక్కని వారిని వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు