బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు

9 Aug, 2019 09:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: మచిలీపట్నం (బందరు) పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచింది. ఈ పోర్టు నిర్మించడానికి 2010 జూన్‌ 7న నవయుగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, పోర్టు నిర్మాణం దిశగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ ఇప్పటికే మరో ఓడరేవును నిర్వహిస్తుండడంతో ఆ ప్రాజెక్టు లాభదాయకతను దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే బందరు పోర్టు నిర్మాణం విషయంలో జాప్యం చేస్తోందని అధికారులు అంటున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరిట ఇప్పటికే నవయుగ సంస్థ తీసుకున్న 471.28 ఎకరాల భూమికి పైసా కూడా లీజు చెల్లించలేదు. దీంతో నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రద్దు చేయడంతో పాటు ఇప్పటికే ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన నష్ట పరిహారాన్ని మచిలీపట్నం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు