అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు

13 Oct, 2023 02:14 IST|Sakshi
ఆరేపల్లి మోహన్‌కు కండువా కప్పుతున్న బండి సంజయ్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి

ఇప్పటికే రాష్ట్రం దివాళా.. 

మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే చిప్పే: కిషన్‌రెడ్డి

కిషన్‌ రెడ్డి, డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వన్నె ఈశ్వరప్ప 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్‌ఎస్‌ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్‌ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్‌ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక  ప్రజా ప్రతినిధులు, నేతలు  కిషన్‌ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు.

వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు.

కేసీఆర్‌ ఆటలో రేవంత్, హరీశ్‌ బలిపశువులు
కేసీఆర్‌ ఆటలో రేవంత్, హరీశ్‌రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్‌ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్‌ నడుస్తోందన్నారు. కేసీఆర్‌ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్‌ లిస్ట్‌ ఫైనల్‌ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్‌ లిస్ట్‌ ఇంకా ప్రగతి భవన్‌ లో ఉంది. కేసీఆర్‌ స్టాంప్‌ పడలేదు.

ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్‌ రెడ్డికి తెల్వదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్‌. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో  హరీషన్న, కాంగ్రెస్‌లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్‌  మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్‌ నేతలు రాహుల్, రేవంత్‌ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు