క్యాన్సర్ వ్యాధి సోకిందని..

4 Feb, 2014 02:40 IST|Sakshi

ఆదోని అర్బన్, న్యూస్‌లైన్: క్యాన్సర్ సోకితే మరణం ఖాయమని భయపడిన ఓ వ్యక్తి వ్యాధితో బాధపడడంకంటే చావడమే మేలనుకుని ఆత ్మహత్య చేసుకున్నాడు. కుటుంబానిన కష్టాల్లోకి నెట్టాడు. ఆదోని మాసామసీద్ కాలనీకి చెందిన జమీల్‌బాషా(45) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమీల్ బాషా పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మొదట స్నేహితులతో కలిసి సరదాగా నమిలిన గుట్కా తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారి చివరకు ప్రాణాలకు మీదకు వచ్చింది.
 
  గుట్కా కారణంగా క్యాన్సర్ వస్తుందని తెలిసినవారు, భార్య, పిల్లలతోపాటు వైద్యులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టిన బాషా ఆ అలవాటును మానుకోలేకపోయాడు. చివరకు గుట్కా కారణంగా దవడల్లో పుళ్లు ఏర్పడి రోజురోజుకు తీవ్రమయ్యాయి.  రెండు నెలల క్రితం ఆసుపత్రికి వెళ్తే క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కోడుమూరు సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లగా ఆపరేషన్ కోసం ఈ నెల 6వతేదీ రావాలని సూచించారు. అయితే వ్యాధి ముదిరి ప్రతి క్షణం ప్రాణాలు తోడేస్తుండడంతో తట్టుకోలేక బాషా సోమవారం ఉదయం బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. భార్య గౌసియా ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు