Delhi Pollution: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి?

11 Nov, 2023 08:48 IST|Sakshi

పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో గత 18 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు మూడున్నర రెట్లు పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణమని వైద్యులు భావిస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.  అలాగే బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్, ఉదర, మూత్ర సంబంధిత క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కారణంగా 11 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

ఢిల్లీ పౌర రిజిస్ట్రేషన్ డేటాలోని వివరాల ప్రకారం 2005వ సంవత్సరంలో ఢిల్లీలో క్యాన్సర్ కారణంగా రెండు వేల నుండి రెండున్నర వేల మంది బాధితులు మరణించారు. గత ఏడాది 7400 మందికి పైగా క్యాన్సర్‌ బాధితులు మరణించారు. పిల్లలు, యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది క్యాన్సర్‌తో మరణించిన వారిలో దాదాపు నాలుగో వంతు మంది 44 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలు కూడా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 14.50 లక్షల మంది క్యాన్సర్‌ బారినపడుతున్నారని, అలాగే ఏటా తొమ్మిది లక్షల మంది బాధితులు మరణిస్తున్నారని ఎయిమ్స్‌ క్యాన్సర్‌ సెంటర్‌ రేడియేషన్‌ ఆంకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిషేక్‌ శంకర్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలలో.. కాలుష్యపూరిత ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాతావరణంలో ఎంపీ 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. క్యాన్సర్‌కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అస్తవ్యస్త జీవనశైలి, ధూమపానం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలైనవి ఉన్నాయి. 
ఇది కూడా చదవండి: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది?

మరిన్ని వార్తలు