ప్రత్యేక హోదా కల్పన బాధ్యత కేంద్రానిదే

6 May, 2016 02:36 IST|Sakshi

ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు

తిరుపతి కల్చరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రాష్ట్రానికి ఐదేళ్లు  ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ చెబితే...  కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని నిలదీసిన ఘనత బీజేపీ నేతలదేనన్నారు. అధికారంలోకి వస్తే  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది కూడా బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, వెంక య్యనాయుడు అని పేర్కొన్నారు.  ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్న చందాగా నేడు కేంద్రంలోని బీజేపీ మంత్రులు ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేయడం రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనన్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధనకు ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్రం రూ. 1600 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉంటే రూ. 6304 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఇందులో ఇప్పటికి రూ. 2800 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తూతూ మంత్రంగా  నిధులు విదిల్చితే ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించారు. 

నూతన రాజధాని నిర్మాణానికి వేల కోట్లు కావాల్సి ఉన్నా కేంద్రం మెతక వైఖరి చూపడం విడ్డూరమన్నారు. అనుమతి లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని చెబుతుంటే...నిర్మించి తీరుతాం, ఎవడొస్తాడని  రెచ్చగొట్టే ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణి మానుకోకపోతే ఎదురు దాడి తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు