షాడోలకు చెక్‌

5 Oct, 2017 10:52 IST|Sakshi

సర్పంచులకు ‘పది’ ముప్పు

పదో తరగతి పాసైతేనే పోటీ

రాష్ట్రాల ఆమోదానికి కేంద్రం లేఖ  

సాక్షి, కడప, బద్వేలు : స్థానిక సంస్థల్లో షాడో పెత్తనానికి చెక్‌ పడనుంది. అక్షరజ్ఞానం లేని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను నడిపించే తెర వెనుక నాయకుల పెత్తనానికి తెర పడే సమయం వచ్చింది. కనీసం పదో తరగగి పాసైతే కాని పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే నిబంధనను తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయమై తీవ్ర కసరత్తు చేసింది. ఎటువంటి విద్యార్హత లేకున్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఇతర ప్రజాప్రతినిధులకు లేని ప్రత్యేకాధికారమైన చెక్‌ పవర్‌ గ్రామ సర్పంచులకు ఉంది. అదే విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలుగా గెలిచిన పలువురు సభ్యుల్లో కనీస విద్యార్హత ఉండటంలేదు.వీరిని స్థానిక షాడో నేతలు తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారనేది బహిరంగ సత్యం. దీంతో పాటు తమ చేతుల్లో ఉంచుకునేందుకు చాలా పార్టీల నేతలు అక్షరజ్ఞానం లేని, సామాజిక అంశాల పట్ల అవగాహన లేని వారిని పోటీల్లోకి దింపడం, గెలిచిన తర్వాత వారిని డమ్మీగా మార్చి పెత్తనాన్ని తమ చేతుల్లోకి చేస్తున్నారు.

దీంతో పాటు అభివృద్ధి ఫలాల నిధులు మింగేయడం, ఎదురు తిరిగిన సర్పంచుల చెక్‌పవర్‌ను అడ్డదారిలో తొలగించడం నిత్యం సాధారణంగా మారాయి. ఇలాంటి సమస్యలన్నింటిని అడ్డుకునేందుకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేసింది. మిగతా రాష్ట్రాల కంటే అక్కడే స్థానిక సంస్థల పాలన మెరుగ్గా ఉండటాన్ని గమనించిన లోక్‌సభ అంచనాల కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రం నివేదిక సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలకు నివేదిక కోరుతూ లేఖ రాసింది. నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసినా సరైన నిర్ణయం తీసుసుకోవాలని పలుమార్లు లేఖలు రాసింది. మన రాష్ట్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు తగిన సూచనలు చేయాలంటూ పంచాయతీరాజ్‌ కార్యాలయానికి సూచించింది. అక్కడి అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆ నివేదికను రాష్ట్రానికి అందించే పనిలో ఉన్నారు.

నలిగిపోతున్న సర్పంచులు
జిల్లాలోని 50 మండలాలలో 795 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 1000 ఎంపీటీసీలు, 50 మంది జడ్పీటీసీ  సభ్యులు ఉన్నారు. సర్పంచుల్లో దాదాపు 450కిపైగా అభ్యర్థులు పదో తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. ఎంపీటీసీల్లో 600 మంది వరకు ఇదే పరిస్థితి. జడ్పీటీసీల్లో 25 మంది విద్యార్హత పదిలోపే. వీటిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వందల సంఖ్యలో ఉన్నారు. రిజర్వేషన్లు ఉండటంతో మహిళలు కూడా పోటీ చేసి గెలుపొందారు. వీరిలో చాలామందికి చదువు లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పని చేయించుకునే సామర్థ్యం ఉండదు. చాలామంది స్థానిక బడా నేతల చేతల్లో నలిగిపోతున్నారు. ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నామని పేర్కొంటూ వారి స్థానంలో షాడో పెత్తనం సాగిస్తున్నారు. సర్పంచుల దగ్గర నుంచి జడ్పీ ఛైర్మన్‌ వరకు ఇలా కొనసాగుతుందంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం జిల్లాలో సగం మంది స్థానిక ప్రజాప్రతినిదుల  బడా నేతల పెత్తనంతో విలవిలలాడుతున్నారు. కాస్తో కూస్తో పెత్తందారుల అక్రమాలను తెలుసుకుని అడ్డం తిరిగితే చెక్‌ పవర్‌ లేకుండా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి అర్హత తప్పనిసరైతే చాలా గ్రామ పంచాయతీల్లో పాలన మెరుగు అవడమే కావ అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు