ఒకరిద్దరితో ఆపొద్దు

19 Jan, 2015 00:20 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు

పిల్లల్ని కనండి.. జనాభాను పెంచండి: సీఎం
పోలవరం పూర్తిచేసే ఎన్నికలకు వెళ్తా
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇప్పిస్తాం
డ్వాక్రా రుణాలూ మాఫీ చేస్తా..
పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం
ఎన్నారైలు స్మార్ట్ గ్రామాలను దత్తత తీసుకోవాలి
పనిలేక పాదయాత్రలని మా ఎమ్మెల్యేలు కొందరు నన్ను విమర్శిస్తున్నారు
‘పశ్చిమ’లో చంద్రబాబు పాదయాత్ర


సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో ఎవరూ కుటుంబ నియంత్రణ పాటించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఒకరిద్దరు పిల్లలతో ఆపకుండా జనాభా పెరుగుదలకు బాటలు వేయాలని కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన బాబు వేలివెన్ను, శెట్టిపేట, తాళ్లపాలెం, శింగవరం తదితర గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

‘కుటుంబ నియంత్రణ పాటించాలని నేనే మొదట్లో చెప్పా.. అంతెందుకు నేను కూడా ఒక్క లోకేష్‌తోనే ఆపేశాను. అయితే ఇప్పుడు జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. చదువుకున్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడంలేదు.. చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు.. ఏటా తొమ్మిది లక్షలమంది శిశువులు చనిపోతున్నారు.. దీనివల్ల యువశక్తి పెరగడం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా యువత తక్కువగా ఉన్నారు.. ఉదాహరణకు జపాన్‌లో వృద్ధులే ఎక్కువమంది ఉన్నారు.. అక్కడ యువశక్తి లేదు.. మన రాష్ట్రం అలా కాకూడదు.. అందుకే ఎక్కువమంది పిల్లలను కనండి.. ఫ్యామిలీ ప్లానింగ్‌తో లాభం లేదు..’ అని చెప్పారు.

రాష్ర్టంలో పిల్లలందరినీ చదివించే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. అందరూ చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. చదువుకున్న వారికి ఉపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. బహుళార్థ ప్రయోజనాలున్న పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే ఎన్నికలకు వెళ్తామన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నాలుగేళ్లలోగా పోలవరాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీపై ఆలోచిస్తున్నామని, త్వరలోనే అన్ని రుణాలూ మాఫీ చేస్తామని చెప్పారు. అప్పటి వరకు ఒక్కపైసా కూడా వడ్డీ చెల్లించొద్దని, ఒకవేళ కట్టినా తిరిగి చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్లలో యంత్రాలతోనే పూర్తిగా వ్యవసాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కూచిపూడి కళ అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రతి ఇంటి నుంచి ఓ కూచిపూడి కళాకారుడు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలు
‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నా వద్ద డబ్బుల్లేవ్.. అన్నీ అప్పులే ఉన్నాయ్.. బాగా డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలి.. అందుకే పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నా..’ అని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, వారికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల బాగోగులను ఉద్యోగులు చూసుకుంటే వారి బాగోగులు తాను చూసుకుంటానని చెప్పారు.

ఎన్నారెలైవరినీ వదలను
‘డబ్బులు సంపాదించుకునేందుకు వెళ్లిపోయారు.. అందరూ బాగానే సంపాదించారు.. ఇప్పుడు మీ గ్రామాల అభివృద్ధికి పాటుపడమని నేను అడుగుతున్నాను.. ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా స్పందించాలి.. అందరూ ముందుకొచ్చేవరకు ఎన్నారెలైవరనీ వదలను..’ అని చెప్పారు. స్మార్ట్ ఏపీలో భాగంగా స్మార్ట్ విలేజ్, వార్డుల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ, ఎన్జీవోల్లో చైతన్యం కల్పించేందుకే తాను పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. అయితే తమ ఎమ్మెల్యేలు, అధికారుల్లో కొందరు ఈయనకు పనిలేక పాదయాత్రలు చేస్తున్నాడా.. అని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎంగా ఎవరూ ఇలా పాదయాత్ర చేసిన దాఖలాల్లేవన్నారు. తొలుత వేలివెన్ను, శెట్టిపేట గ్రామాలను స్మార్ట్ విలే జ్‌లుగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

మామూలుగా 14 కి.మీ... బాబు నడిస్తే 18 కి.మీ...
ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా 18వ తేదీ ఆదివారం 18 కిలోమీటర్ల మేర పాదయాత్రకు తాను శ్రీకారం చుట్టినట్లు యాత్ర మొదలైన వేలివెన్నులో చంద్రబాబు ప్రకటించారు. అక్కడి గ్రామంలో కలియతిరిగిన బాబు ఆ ఊరు దాటి  వెలగదుర్రు మీదుగాశెట్టిపేట రాగానే, ఈ రోజు 16, 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నానంటూ మాటమార్చారు.

వేలివెన్ను నుంచి శెట్టిపేట, తాళ్లపాలెం, సింగవరం గ్రామాల మీదుగా నిడదవోలు బహిరంగసభకు వచ్చిన సీఎం సరిగ్గా నడిచింది 14 కిలోమీటర్ల లోపేనని అధికారులు పేర్కొంటున్నారు. మూడువేల మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేసిన ఈ పాదయాత్రలో కనీసం ఐదొందలు మంది జనం, కార్యకర్తలు కూడా బాబు వెంట నడవలేదు. బాబు ప్రతిపక్షంలో ఉండగా చేపట్టిన మీకోసం పాదయాత్రే దీనికంటే మెరుగ్గా సాగిందని టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆగాలని జనాన్ని బతిమిలాడిన పోలీసులు
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు నిడదవోలు చేరుకున్న చంద్రబాబు బహిరంగసభలో మాట్లాడేందుకు మైకు తీసుకోగానే సభ నుంచి జనం వెళ్లిపోవడం ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5-6 గంటల మధ్య చంద్రబాబు ఇక్కడ సభలో ప్రసంగించాలి. పాదయాత్ర కారణంగా ఆయన వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. అసలే చలికాలం కావడంతో సభికులు కూర్చోలేక అప్పటికే చాలామంది వెళ్లిపోయారు. బాబు రాగానే ప్రసంగం మొదలు పెట్టకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు మైక్ ఇచ్చారు.

దీంతో అప్పటికే అసహనంగా ఉన్న కొద్దిపాటి జనం కూడా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు గ్రౌండ్ గేట్లు మూసివేసి.. ఆగండి.. బాబు ప్రసంగిస్తారు.. అంటూ బతిమిలాడారు. అప్పటికే విషయం అర్థమై చంద్రబాబు ప్రసంగం ప్రారంభించినా జనం పోలీసులతో వాదులాడి మరీ వెళ్లిపోయారు. ఇదిలాఉండగా మధ్యమధ్యలో ప్రసంగించేందుకు వాహనం ఎక్కి, ప్రహసనంలా సాగించిన పాదయాత్ర చివరికి 14 కిలోమీటర్లకే పరిమితమైంది.

నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు
సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.15కు విజయవాడ చేరుకుని 12.45కు ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విశ్రాంతి అనంతరం 2 గంటలకు మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4 వరకూ అక్కడే ఉండి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరతారని అధికారవర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు