ఒప్పందాలతో ఏపీకి రూ 35,745 కోట్లు

29 Apr, 2015 10:59 IST|Sakshi
ఒప్పందాలతో ఏపీకి రూ. 35,745 కోట్లు

విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఇండస్ట్రీయల్ మిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....దాదాపు 46 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.35,745 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.

అంతేకాకుండా 72,710 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 48 కొత్త యూనిట్లు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని... వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనాలున్నాయన్నారు. 2020 నాటికి దేశ జనాభాలో 60 శాతం మంది యువతే ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని.. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రాభివృద్ధికి 7 మిషన్లు, 5 గ్రిడ్లు ప్రారంభించామన్నారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని సమీకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్న మంచి వృద్ధిరేటు సాధించామన్నారు. పారిశ్రామికవేత్తలకు లైసెన్స్లు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు