రుణమాఫీ.. రైతుకు టోపీ

24 Jan, 2019 07:43 IST|Sakshi
తమ రుణాలు మాఫీ కాలేదంటూ పత్రాలు చూపిస్తున్న గిరిజన రైతులు

అన్నదాతలను నిండా ముంచిన చంద్రబాబు

రుణమాఫీ కాకపోవడంతో పెరిగిన అప్పులు

రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల ఒత్తిళ్లు

దిక్కుతోచని స్థితిలో గిరిజన రైతులు

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ‘నమ్మితి చంద్రన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా’ అన్నట్టు తయారైంది రైతుల పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీని నమ్మి నిండా మునిగామని గగ్గోలు పెడుతున్నారు ఏజెన్సీ రైతులు. ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో ఉన్న రుణం మాఫీ చేస్తామని చెబితే నమ్మామని అయితే అధికారంలోకి రాగానే రుణమాఫీ పథకానికి కొర్రెలు పెట్టి తమకు కష్టాలు తెచ్చిపెట్టారని ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకు అప్పులు తడిసిమోపెడయ్యాయని ఆందోళన చెందుతున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు.

రూ.70 వేలకు రూ.35 వేల వడ్డీ
రూ.70 వేలు రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలు చెల్లించలేకపోయామని, అప్పునకు వడ్డీ రూ.35 వేలు పెరిగిందని మొత్తంగా రూ.1.05 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని బుట్టాయగూడెం మండలం బెడదనూరుకు చెందిన కోర్సా బాలకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో రూ.50 వేల వరకూ రుణం తీసుకున్న చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అంటున్నాడు. రుణమాఫీ పత్రాలు చేతికి ఇచ్చారే తప్ప బ్యాంకుల్లో మాత్రం సొమ్ములు జమ కాలేదంటూ ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో అధికారులను రైతులు నిలదీశారు.

ప్రకటనలకే పరిమితం
బుట్టాయగూడెం మండలంలోని అంతర్వేదిగూడెం, రెడ్డిగణపవరం, బెడదనూరు, వాడపల్లి కాలనీ, వెలుతురువారిగూడెం గ్రామాల్లో చిన్నసన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. వీరిలో రూ.30 వేలు తీసుకున్న చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. అయితే అధికారులు మాత్రం అర్హులందరికీ రుణ మాఫీ అంటూ ప్రకటనలు చేస్తున్నారు.

సుమారు 36 వేల మంది వరకు బాధితులు
పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు 2,37,665 హెక్టార్లలో వ్యవసాయ భూ ములున్నాయి. వీటిలో 52 వేల మందికి పైగా రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో 16 వేల మందికి మాత్రమే రుణమాఫీ అయినట్టు సమాచారం. మిగిలిన వారందరికీ రుణమాఫీ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తాము రుణాలు చెల్లించలేదని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిసి తలకు మించిన భారంగా తయారైందని పలువురు వాపోతున్నారు.

అంతా మాయ
రుణమాఫీ అంతా మాయ. గద్దెనెక్కడం కోసం మాయమాటలు చెప్పారు. పదవులు వచ్చాక రైతుల సమస్యలను మరిచారు. నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ చేయకపోగా కొత్త డ్రామాలకు తెరలేపుతూ ఎన్నికల్లో మోసం చేసేందుకు చూస్తున్నారు. టీడీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు.– తెల్లం దుర్గారావు, రైతు, తెల్లంవారిగూడెం

మరిన్ని వార్తలు