కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ: చంద్రబాబు

4 Aug, 2018 13:09 IST|Sakshi
స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తున్న వారు 30 శాతమే

సీఎం చంద్రబాబు అసహనం

సాక్షి, తిరువూరు: ‘నేను 24 గంటలూ మీకోసం కష్టపడుతున్నాను. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడానికి కృషిచేస్తున్నాను. కేంద్రం సహకరించకున్నా ఉన్నంతలో అభివృద్ధి చేస్తున్నాను. ఇంకా మీ సమస్యలుంటే పరిష్కరిద్దామని, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు తెలుసుకుందామని ఫోన్లు చేస్తే ఎవరూ స్పందించట్లేదు. నా ఫోన్‌ కాల్స్‌కి 30 శాతం మంది మాత్రమే స్పందించి బదులిస్తున్నారు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ప్రతి వారిచేతిలో సెల్‌ఫోను ఉన్నా దానిని వినియోగించడంలో శ్రద్ధ చూపట్లేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేస్తామని, ప్రతి ఇంట్లో చెత్తసేకరణను డిజిటలైజేషన్‌ చేసి స్వయంగా తాను పర్యవేక్షిస్తానన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసి డిజిటల్‌ లాకర్లో భద్రపరుస్తామని, అధిక బరువున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు సూచించారు. 

కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ..
రాయలసీమలో పౌష్టికాహారలోపంతో ప్రజలు బాధపడుతుంటే కృష్ణాజిల్లాలో అధిక బరువుతో, కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసే నిదర్శనమని సీఎం చెణుకులు విసిరారు. విద్యార్థుల్లో పోషక విలువలు పెంచడానికి ‘బాలసంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, మహిళలకు సజ్జ లడ్డూల పంపిణీతో సత్ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నానన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ, మంత్రులు దేవినేని ఉమమహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచి రామారావు, ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు స్వామిదాసు, బాలవర్థనరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కలెక్టర్‌ లక్ష్మీ కాంతం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ఎస్సీ త్రిపాఠీ పాల్గొన్నారు.

‘2024లో మళ్లీ వస్తా’
తాతకుంట్ల(విస్సన్నపేట): ‘మీ ఊరు స్మార్ట్‌ విలేజ్‌గా అభివృద్ధి చెందాలి.. మళ్లీ 2024లో వస్తా అప్పటికి ఈ ఊరి స్వరూపమే మారిపోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలోని తాతకుంట్లగ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొదటగా ఏరువాక కార్యక్రమంలో పాల్గొని, ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటగుంటను పరిశీలించారు. అనంతరం మండలపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలనలో విద్యార్థులు జీఎస్టీ అంటే ఏమిటి.. దానివల్ల ఉపయోగమా, నష్టమా? అనే అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చెరువు కట్టమీద మొక్క నాటి, గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. పక్కా గృహ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామసభ, రచ్చబండ నిర్వహించారు. ఈ–అంబులెన్స్‌ యాప్‌ను ప్రారభించిన సీఎం గ్రామ వనాలు, గ్రామ సంతలు, గోకులాలకు శంకుస్థాపన చేశారు.  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ అనూరాధ, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు సుధారాణి, గ్రామ నాయకుడు ఎన్టీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎంను నిలదీసిన దివ్యాంగురాలు తాతకుంట్ల గ్రామదర్శిని
తిరువూరు: ‘నాకు 95శాతం వైకల్యం ఉంది. డాక్టర్లు 67శాతమే ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే పింఛన్‌ వస్తోంది. నేను ఏ పనీ చేయలేను, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నా.. నాకు పూర్తిస్థాయి పింఛన్‌ ఎందుకివ్వరు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఓ దివ్యాంగురాలు కోలేటి జ్యోతి నిలదీసింది. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా తాతకుంట్ల వచ్చిన ముఖ్యమంత్రి స్థానికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో దివ్యాంగురాలు కోలేటి జ్యోతి సీఎంతో మట్లాడుతూ.. తాను తాతకుంట్ల శివారు గౌరంపాలెంలో నివసిస్తున్నానని, నా అనేవారు ఎవరూ లేరని, ఇతర దివ్యాంగులకు నెలకు రూ.15వందల పింఛన్‌ వస్తుంటే తనకు మాత్రం రూ.వెయ్యి ఇస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వివరించింది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిలు కూడా పాడైపోయిందని అధికారులకు విన్నవించినా కొత్తది ఇవ్వట్లేదని వాపోయారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆమెకు ఇకపై నెలకు రూ.15వందల పింఛన్‌ ఇవ్వాలని సీఎం స్థానిక అధికారులను ఆదేశించారు. రూ.50వేల ఆర్థికసాయం చెక్కును అందజేసి కొత్త మూడు చక్రాల సైకిలు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా