-

హద్దులు దాటిన అరాచకం

23 Jan, 2020 04:36 IST|Sakshi
శాసన మండలిలోని అధికారుల గ్యాలరీలో కూర్చొని కుతంత్రాలు నడుపుతున్న చంద్రబాబు, పక్కన బాలకృష్ణ తదితరులు

అసాధారణ రీతిలో అధికారుల గ్యాలరీలో మండలి చైర్మన్‌ ఎదురుగా కూర్చున్న చంద్రబాబు

అక్కడ నుంచి సైగలు చేస్తూ తన సభ్యులకు ఆదేశాలు

బాలకృష్ణ, పయ్యావుల, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య సైతం అక్కడే..

అక్కడ నుంచి వెళ్లిపోవాలన్న మార్షల్స్‌పై చంద్రబాబు అరుపులు, కేకలు

ఒక దశలో మార్షల్స్‌ పైకి దూసుకెళ్లిన టీడీపీ అధినేత

తమాషాలు చేస్తున్నారా.. స్పీకర్‌ను రమ్మనండంటూ ఊగిపోయిన బాబు

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై శాసన మండలిలో బుధవారం చర్చ ముగిసే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అరాచకం హద్దులు దాటింది. మండలిలో ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపించేందుకు ఆయన శతధా ప్రయత్నించారు. అసాధారణ రీతిలో ఆయన శాసనమండలి అధికారుల గ్యాలరీకి హుటాహుటిన టీడీపీ ఎమ్మెల్యేలతో వచ్చారు. అక్కడ మండలి చైర్మన్‌కు ఎదురుగా నిలబడే సైగలు చేస్తూ చైర్మన్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాక.. టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలు చేస్తూ అధికార పక్ష సభ్యులు, మంత్రులతో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రేరేపించారు. గ్యాలరీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మార్షల్స్‌ చంద్రబాబును కోరగా.. ఆయన ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపైకి దూసుకెళ్తూ పెద్దపెద్దగా కేకలు వేశారు. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరించారు. ఆయన దౌర్జన్యకాండ ఎలా సాగిందంటే..

బిల్లులపై చర్చ అనంతరం మంత్రుల సమాధానం కూడా పూర్తయిన తరువాత మండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బిల్లుకు సవరణలను ప్రతిపాదించామని, సెలక్ట్‌ కమిటీకి పంపించాలన్నారు. ఇందుకు సంబంధించి మోషన్‌ కూడా ఇచ్చామన్నారు. దీంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు ఇతర మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇది అన్యాయమంటూ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతున్న సమయంలో చంద్రబాబు సా. 5గంటల ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి అధికారుల గ్యాలరీలోకి వచ్చి చైర్మన్‌కు ఎదురుగా నిలబడ్డారు. ఆయన చైర్మన్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలుచేస్తూ మంత్రులుపైకి వెళ్లేందుకు ప్రేరేపించారు. అదే సమయంలో చంద్రబాబు పక్కనే ఉండి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీఎల్‌పీ కార్యాలయ ఉద్యోగి సురేశ్‌ కూడా మండలి ప్రొసీడింగ్స్‌ను తమతమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీశారు. ఇది గమనించిన మార్షల్స్‌ వారిద్దరినీ వారించారు. మరోవైపు.. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతుండడంతో చైర్మన్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

ఆ సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, చిన్నరాజప్ప, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్‌లు అధికారుల గ్యాలరీలోనే తిష్టవేశారు. ఈ సమయంలో మార్షల్స్‌ వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా మార్షల్స్‌పైకి దూసుకువెళ్లి.. ‘వెళ్లిపోమని చెప్పడానికి స్పీకర్‌ ఎవరు? ఆయనను వచ్చి ఈడ్చుకు వెళ్లమనండి.. ఇక్కడ నుంచి నేను వెళ్లేది లేదు’.. అంటూ మార్షల్స్‌పై చంద్రబాబు పెద్దపెద్దగా కేకలు వేశారు. అంతేకాక.. ‘చైర్మన్‌ను చెప్పమనండి వెళ్తాను. తమాషాలు చేస్తున్నారా, ఇష్టానుసారం చేస్తారా ఇది పోలీసు రాజ్యమా’.. అంటూ వారిపై ఊగిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక మార్షల్స్‌ బిత్తరపోయారు. 

వైఎస్సార్‌సీపీ నేతల రాక
మరోవైపు.. వీఐపీ గ్యాలరీల్లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డితోపాటు రోజా, కాసు మహేశ్‌రెడ్డి తదితర అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని మండలి ప్రొసీడింగ్స్‌ను వీక్షించారు. 

మరిన్ని వార్తలు