-

స్టార్‌ కమెడియన్‌ మరణం.. ఆస్తి రాసినా దక్కలేదు.. అనాథలా వదిలేసిన కుటుంబం.. దిక్కు తోచని స్థితిలో..

26 Nov, 2023 13:47 IST|Sakshi

కమెడియన్స్‌ అనగానే చాలామందికి మగవారి పేర్లే గుర్తొస్తాయి. కానీ ఓ నటి మాత్రం వెండితెర మీద మేల్‌ కమెడియన్స్‌కు గట్టిపోటీనిచ్చింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరే ఫిలోమినా.. మలయాళంలో ఫేమస్‌ నటి. సుమారు 750కు పైగా చిత్రాల్లో నటించింది. సహాయ పాత్రలు, కామెడీ రోల్స్‌, తల్లి, అమ్మమ్మ పాత్రలు చేసింది. గాడ్‌ఫాదర్‌ సినిమాలో అనప్పర అచ్చమ్మగా నటించి ఏడిపించింది కూడా! మాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈమె 2006లో చెన్నైలో తన కుమారుడు జోసెఫ్‌ ఇంట్లో కన్నుమూసింది. ఆమె మరణం తర్వాత తన కుటుంబం ఎక్కడుంది? ఏం చేస్తుందన్న వివరాలే రాలేదు.

ఆస్తిలో ప్రియుడికి వాటా
అయితే తాజాగా మలయాళ సినీప్రియులు బాధపడే విషయం వెలుగులోకి వచ్చింది. ఫిలోమినా పార్ట్‌నర్‌ రామ్‌సే ఫ్లూయెర్‌ అలియాస్‌ సన్నీ (82) అనాధాశ్రమంలో చేరాడు. నటి, ఆమె మొదటి భర్తకు పుట్టిన కొడుకు ఉన్నప్పటికీ ఒంటరివాడయ్యాడు. నిజానికి ఫిలోమినా చనిపోయేముందు తన ఆస్తిలో కొంత భాగాన్ని సన్నీకి రాసిచ్చింది. ఎందుకో కానీ ఇంతవరకు అది అతడికి దక్కనేలేదు. నటి మరణించాక అతడిని పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. దివంగత స్టార్‌ హీరో ప్రేమ్‌ నజీర్‌ దగ్గర ఒకప్పుడు డ్రైవర్‌గా పని చేసిన ఇతడు సదరు హీరో పాత సినిమాలను వివిధ ఛానెల్స్‌కు అమ్ముకుంటూ దాని మీదే బతుకుతున్నాడు.

అందరికీ భారమయ్యానని..
అతడికున్న ఏకైక ఆస్తి.. ప్రేమ్‌నజీర్‌ ఇచ్చిన ఇల్లు, ప్లాట్‌.. దాన్ని కూడా అతడి సోదరి లాగేసుకుంది. అప్పుడప్పుడు తన ఇంటికి తానే అతిథిగా వెళ్తుండేవాడు. కానీ, ఓ నాలుగు రోజులు ఎక్కువ ఉంటే ఈయన ఎప్పుడు వెళ్తాడా? అని ఎదురుచూసేవారట. డబ్బుల్లేని తాను కొడుక్కి, కుటుంబసభ్యులకు.. అందరికీ భారమయ్యానని గ్రహించిన సన్నీ అందరికీ దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. చెన్నైలోని గాంధీభవన్‌ వృద్ధాశ్రమంలో చేరిపోయాడు. ఈ ఆశ్రమంలో తన స్నేహితులు, నటులు చంద్రమోహన్‌, టీపీ మాధవన్‌ వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వారితోనే శేష జీవితం గడిపేస్తానంటున్నాడు సన్నీ.

భర్త మరణంతో సన్నీకి దగ్గరైన నటి
నిజానికి ఫిలోనిమా 1956లో థియేటర్‌ ఆర్టిస్ట్‌ ఆంటోనీని పెళ్లి చేసుకుంది. వీరికి జోసెఫ్‌ అని కుమారుడు జన్మించాడు. వివాహమైన నాలుగేళ్లకే ఆంటోని మరణించాడు. ఆ తర్వాత సన్నీతో ప్రేమలో పడిన ఫిలోనిమా అతడితో సహజీవనం చేసింది. చివరి శ్వాస వరకు అతడితోనే కలిసి ప్రయాణించింది, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

చదవండి: యానిమల్‌లో రణ్‌బీర్‌కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్‌ కంటే తక్కువేం కాదు!

మరిన్ని వార్తలు