అఖిలపక్షంపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు

31 Oct, 2013 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయం కాంగ్రెస్‌లోని ఇరు ప్రాంతాల నేతల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. కొందరు ఈ అఖిలపక్షాన్ని ఆహ్వానిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఈ భేటీ నిర్వహిస్తుం డటంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఈ భేటీ నిర్ణయం వెనుక వేరే ఏదైనా మతలబు ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

పీసీసీ తరఫున ఈ భేటీకి ఎవరు హాజరు కావాలి? గతంలో మాదిరి ఇరు ప్రాంతాలనుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దర్నీ పంపిస్తారా? ఒకవేళ అలా పంపాలని నిర్ణయిస్తే సీమాంధ్ర ప్రతినిధిగా హాజరయ్యే నాయకుడికి ప్యాకేజీ కోరడం మినహా మరో అవకాశం ఉండదు. అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశానికి హాజరై ప్రయోజనమేంటి? వంటి అనేకాంశాలు నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. అఖిలపక్ష భేటీకి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇద్దరూ కలసి చర్చించి రెండు పేర్లను పంపిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

గతంలో అఖిలపక్షాన్ని నిర్వహించిన సందర్భాల్లో పార్టీలనుంచి ఇద్దరేసి ప్రతినిధులకు అవకాశమిచ్చారు. ఈసారి ఎందరిని పిలుస్తారన్న దానిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చిదంబరం హోంమంత్రిగా నిర్వహించిన సమావేశాలకు సీమాంధ్ర నుంచి కావూరి సాంబశివరావు, తెలంగాణ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. షిండే హోంమంత్రి అయ్యాక నిర్వహించిన అఖిలపక్ష భేటీకి సీమాంధ్ర నుంచి గాదె వెంకటరెడ్డి, తెలంగాణ నుంచి కేఆర్ సురేష్‌రెడ్డి వెళ్లారు. ఈసారీ అదేవిధంగా ఇద్దరికి అవకాశమిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఈసారి ఒకే ప్రతినిధిని ఆహ్వానిస్తే పీసీసీ అధ్యక్షుడే హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

విభజన నిర్ణయం నేపథ్యంలో సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే అఖిల పక్ష సమావేశమైనందున ప్యాకేజీ కోరడమొక్కటే తమ ముందున్న అంశమని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు సమైక్య ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ అఖిలపక్ష నిర్ణయంపై తలోరకంగా స్పందిస్తున్నారు. దీనికి తాము వెళ్లబోమని, పార్టీ ఎవరిని పంపిస్తుందో తమకు తెలియదని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్, మంత్రి సాకే శైలజానాథ్ మీడియాకు చెప్పారు. విభజనపైనే ఈ అఖిలపక్షమైతే తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

>
మరిన్ని వార్తలు