మెయింటెనెన్స్‌ పోస్టుల మోసం

13 Jun, 2017 10:45 IST|Sakshi
మెయింటెనెన్స్‌ పోస్టుల మోసం

► అంగట్లో సరుకులు లాగా అమ్మకాల జోరు
► ఒక్కో పోస్టుకు రూ.3లక్షలు పైగానే..
► ఒక్క పోస్టు కూడా భర్తీ కాదంటున్న సీఈ
► ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులు జారీ
► నమ్మి మోసపోవద్దంటున్న ఆర్టీపీపీ సీఈ శ్రీరాములు  


ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో మెయింటెనెన్స్‌ పోస్టుల అమ్మకాల మాయాజాలం తాజాగా వేడిపుట్టిస్తోంది. చెట్టును చూపించి కాయలు అమ్మినట్లుగా అసలు ఇంతవరకు నోటిఫికేషన్‌ పడలేదు.. అసలు ఆ ఊసేలేదు.. కానీ కొందరు స్వార్థపరులు అత్యాశతో ఈ అమ్మకాల వ్యవహారానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే..త్వరలో ఆర్టీపీపీలో కాంట్రాక్టు పద్ధతిన మెయింటెనెన్స్‌ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రచారం రావడంతో వాటి కోసం రాజకీయ నాయకులు, కొన్ని కార్మిక సంఘాల నాయకులు కౌంటర్లను తెరిచారు. డబ్బులిస్తే పోస్టును వేయిస్తామంటూ లక్షలు వసూలు చేయడం ప్రారంభించారు. వారి హడావుడితో ఒక్కొక్క పోస్టు రూ.3లక్షలు పైగానే పలుకుతోంది. కొందరు అమాయకులు ఇప్పటికే వారి మాయమాటలకు బలైపోయారు. ఇదిగోఅదిగో అంటు డబ్బులు ఇచ్చిన వారికి దళారులు నానా కథలు చెబుతున్నారు.

అధికారపార్టీ నేతలే దళారులు!
గతంలో ఆర్టీపీపీలో మెయింటెనెన్స్‌ పోస్టులను భర్తీ చేశారు. అయితే అప్పుడు నానారభస జరిగి పోస్టుల భర్తీని నిలిపివేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారి టీడీపీ పాలన వచ్చింది. డబ్బులిస్తే పోస్టులు వేయిస్తామని కొందరు అధికారపార్టీ నాయకులు దళారుల అవతారం ఎత్తారు. వారితో పాటు ఆర్టీపీపీలో పనిచేసేవారు కూడా అమ్మకాల్లో ఉన్నారు. వీరి చేతిలో చాలామంది అమాయకులు మోసపోయారు. ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న వారే అనగా కార్మిక సంఘాలు నడుపుతున్న వారిలో కొందరు నేతలు కూడా పోస్టులు ఇప్పిస్తామని డబ్బులను వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఇటీవల పోస్టు ఇస్తామని నమ్మించి ఆర్టీపీపీలోని ఓ ఉద్యోగి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ బాధితుడు మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇంతవరకు ఆదేశాలు రాలేదు
అసలు పోస్టులు భర్తీచేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాక ఏన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఏపీ జెన్‌కో తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టీపీపీలో మెయింటెనెన్స్‌ పోస్టులు భర్తీ జరగదని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెయింటెనెన్స్‌ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ విషయం తెలియని అమాయకుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారు.

డబ్బులిచ్చి మోసపోవద్దు.
ఆర్టీపీపీలో పోస్టుల భర్తీలేదని, ఎవరు కూడా దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. మెయింటైన్స్‌ పోస్టుల భర్తీ ఏపీజెన్‌కో, ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతాయి. ఆ పోస్టుల భర్తీలో కూడా భూనిర్వాసితులకు ప్రథమ ప్రా«ధ్యానత ఉంటుంది. మెయింటైన్స్‌ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేదని అసలు భర్తీ జరగదు. దళారులను నమ్మి మోసపోయి డబ్బులు ఇవ్వొద్దు. –శ్రీరాములు, ఆర్టీపీపీ సీఈ, ఎర్రగుంట్ల

మరిన్ని వార్తలు