చెన్నూరుకు తీపికబురు

11 Jun, 2019 09:10 IST|Sakshi

చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదం

కార్మికులు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

సాక్షి, ఖాజీపేట : నాడు రైతులకు, కార్మికులకు కడుపునిండా అన్నం పెట్టి బతుకు బండిని నడిపిన చక్కెర ఫ్యాక్టరీ చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా 1995, 2009లో మూతపడింది. కార్మికుల ఆకలి చావులకు చంద్రబాబు కారణం అయ్యారు. నేడు జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి కేబినెట్‌ సమావేశంలోనే మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు తీర్మానం చేయడంతో కార్మికులు, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్‌ఆర్‌ హాయాంలో ఫ్యాక్టరీ అభివృద్ధికి నిధులుఇచ్చారు. నేడు సీఎం జగన్‌ పూర్వవైభవం తీసుకురానున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చెరుకు సాగు చేసే రైతులు, కార్మిక, కూలీల జీవితాల్లో తీపి నింపేందుకు 1971లో చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభించారు. 1974లో పూర్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం నుంచి 60.15 ఎకరాలు, రైతుల భూమి 30.71 ఎకరాలతో కలిపి 5 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు.ఇందులో 9వేలమంది రైతులు వాటాదారులుగా ఉన్నారు. ప్రతి రైతు 1971లో రూ 2,200 పెట్టుబడిగా పెట్టారు. ఫ్యాక్టరీలో రైతుల వాటా 54.11 శాతం ఉంది.1975లో క్రషింగ్‌ పనులు మొదలయ్యాయి. 1995లో తొలిసారి ఫ్యాక్టరీ మూతపడింది.

దీనిని పునురుద్ధరించాల్సిన అప్పటి సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ఫ్యాక్టరీని తెరిపించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఐదేళ్లకు రూ.19కోట్ల నిధులను ఇప్పించారు. 2010లో ఫ్యాక్టరీ నిర్వహణకు రూ.5కోట్ల 50 లక్షలు బ్యాంకుల నుంచి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పించని కారణంగా మళ్లీ మూతపడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. దీంతో వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధిపథంలో నడిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది.తిరిగి వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు