బోరుబావిలోని బాలుడు మృతి.. 110 గంటల శ్రమ వృథా

11 Jun, 2019 09:07 IST|Sakshi

5 రోజుల ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూతో సేఫ్‌

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పంజాబ్‌లోని సంగ్రూర్‌ గ్రామంలో ఘటన

చండీఘడ్‌ : గత ఐదురోజులోగా అధికారుల చేసిన ప్రయత్నం.. బూడిదలో పోసిన పన్నీరు అయింది. వారి 110 గంటల శ్రమ వృథా అయింది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు  చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్‌ 6(గురువారం)న సాయంత్రం గ్రామంలో ఆడుకుంటున్న ఫతేవీర్(3) ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్‌), పోలీసులు, స్థానిక వాలంటరీల సహాయంతో సుమారు 110 గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 

ఆ బోర్‌వెల్‌ బట్టతో కప్పిఉండగా.. గమనించని బాలుడు అందులో పడిపోయాడు. 9 ఇంచ్‌లే ఉన్న ఆ బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయి కదల్లేకుండా నరకయాతన అనుభవించాడు. 150 అడుగుల లోతులో ఫతేవీర్‌ చిక్కుకున్నట్టు కెమెరాల ద్వారా గుర్తించిన సహాయక బృందం... బోరుబావికి సమాంతరంగా బావిని తవ్వారు. పైప్‌లతో ఆక్సిజన్ అందించి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఐదు రోజులుగా నిరంతరం శ్రమించి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాము చేసిన పూజలు, హోమాలు ఫలించాయని సంబరపడిన ఆ తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆనందం కొద్దిక్షణాల్లోనే ఆవిరైంది. బాలుడి మృతితో ఆ ఊరిలో విషాదచాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తెరిచి ఉన్న బోరుబావిలను మూసేయాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. బాలుడి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దేశంలో ఈ తరహా ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న బోరుబావిలను పూడ్చకుండా అలానే వదిలేస్తున్నారు. అధికారులు, బోరుబావి యజమానుల నిర్లక్ష్యంతో అమాయక చిన్నారులు బలవుతున్నారు. బోరుబావి ప్రమాదాలపై ‘కర్తవ్యం’ వంటి సినిమాలు, ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చినా జనాలు బోరుబావిల పట్ల అదే నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు.

మరిన్ని వార్తలు