బాబు పాలనలో పేదలకు అన్యాయం

25 Nov, 2014 00:15 IST|Sakshi
బాబు పాలనలో పేదలకు అన్యాయం

 కోరుకొండ :ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల నిలిపివేతకు నిరసనగా సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొన్నింటిని చంద్రబాబు రద్దు చేసి, మరికొన్నింటికి పేర్లు మారుస్తున్నారని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికీ ఏ ఒక్కదానిని అమలు చేయలేదని ఆరోపించారు.
 
 రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్లు కోల్పోయిన వారు చంద్రబాబు పాలనతో విసుగు చెందారన్నారు. డిసెంబర్ మొదటి వారంలో నిలిపివేసిన పింఛన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాఉండగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద  పింఛన్ల కోసం గగ్గోలు పెట్టారు. ఇటీవల పింఛను కోల్పోయిన శ్రీరంగపట్నానికి చెందిన 90 ఏళ్ల మెల్లెం మరియమ్మను ఆమె బంధువులు మంచంపై తీసుకొచ్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ బొల్లిన సుధాకర్, బీసీ సెల్ మండల కన్వీనర్ సూరిశెట్టి భద్రం, మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
 సొమ్మసిల్లిన వృద్ధురాలు
 ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన 86 ఏళ్ల యర్రంశెట్టి మంగాయమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు జక్కంపూడి విజయలక్ష్మి మంచినీరు పట్టించారు. కోరుకొండ పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు ప్రాథమిక చికిత్స చేసి, ఆటోలో ఆస్పత్రికి
 తరలించారు.
 

మరిన్ని వార్తలు