అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రాదు: అయ్యన్న పాత్రుడు

13 Nov, 2023 08:30 IST|Sakshi

స్కిల్ స్కాం కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో టిడిపి శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్టీయార్ హయాంలో  టిడిపికి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర  2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా నియోజక వర్గాల్లో టిడిపికి అభ్యర్ధులు కూడ లేని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలో  ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అక అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా లోకల్ లో ఎవరూ లేకపోవడంతో దిలీప్ చక్రవర్తి అనే క్యాండిడేట్ ను దిగుమతి చేసుకుంది టిడిపి. దీనిపై  పార్టీలోని మాజీ మంత్రులు  నిప్పులు చెరుగుతున్నారు.
 
2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు  పార్లమెంటు నియోజక వర్గంలోనూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించి  టిడిపిని తుడిచి పెట్టేసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ  టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది.  నాలుగున్నరేళ్లుగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టేవారే కరవయ్యారు. చోడవరం, మాడుగుల, ఎలమంచిలి వంటి నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా లేరు. ఈ నేపథ్యంలో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం నుంచి బరిలో దింపడానికి పార్టీ నాయకత్వం కోట్లకు పడగలెత్తిన దిలీప్ చక్రవర్తి అనే  సంపన్నుణ్ని దిగుమతి చేసుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 ఈ సమాచారంతో  పార్టీ సీనియర్లు  నిప్పులు చెరుగుతున్నారు. మాజీ మంత్రులు చింత కాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణలు అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు. తాము లేదా తమ తనయులను బరిలో దింపాలని వారు  ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు దిలీప్ చక్రవర్తి పేరు  బయటకు రావడంతో పార్టీ నేతలు మండి పడుతున్నారు. తమలో ఎవరికి సీటు ఇచ్చినా గెలవకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు వస్తాయని ..అదే దిలీప్ వంటి బయటి వ్యక్తులను దింపితే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని  సీనియర్ నేతలు  హెచ్చరిస్తున్నారు.  ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికే తీసుకెళ్తున్నారు.

 ఒక పక్క స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడి కారణంగా పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిపోయిందని   టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.  స్కిల్ స్కాంతో పాటు మరో డజనుకు పైగా  అవినీతి కేసుల్లో చంద్రబాబు ఉన్నట్లు సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్లు  తెలుస్తుండడంతో టిడిపి నేతల్లో  ఒక విధమైన నిరాశ  నిస్సృహ ఆవరించేసిందని అంటున్నారు.

మరిన్ని వార్తలు