టీడీపీపై బీజేపీకి అనుమానం

21 Mar, 2018 08:40 IST|Sakshi
సీఎం చంద్రబాబు నాయుడు(పాత చిత్రం)

అమరావతి: టీడీపీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నప్పటికీ ఢిల్లీ పరిణామాలపై సీఎం నిశితదృష్టి సారించారు.

సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజలకోసం పోరాడుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. మన హక్కుల కోసం పోరాడుతున్నాం. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, సంఘటితంగా ఉండాలి. ఆగస్ట్ సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపై చివరిదాకా నిలిచారు. ఘన విజయం సాధించారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ఎంపీలు అందరిలో కనిపించాలి. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడాలి. మనకు ఎవరిమీదా కోపం, ద్వేషం లేదు. కేంద్ర పెద్దలు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. పైపెచ్చు అన్యాయం చేశారనే భావన ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయి’ అని అన్నారు.

బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతిగా ఉన్నాయని, మద్ధతు కూడా ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇది స్ఫూర్తిదాయక సమయమని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుందని అన్నారు. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడం లేదని తెలిపారు. నాలుగేళ్లు ఎదురుచూశామని, ఆఖరి బడ్జెట్లో కూడా మనకు న్యాయం జరగలేదని, దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చిందన్నారు. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని వ్యాఖ్యానించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. దేశరక్షణ, సైన్యం నిధులు అడిగామనడం ప్రజల్లో ఆవేశం పెంచిందని తెలిపారు. విభజనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని పేర్కొన్నారు. వృద్ధిరేటులో తెలంగాణ కన్నా 2 శాతం ముందున్నామని, తలసరి ఆదాయంలో రూ.33 వేలు వెనుక ఉన్నామని వెల్లడించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా..? ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు